ముద్రగడ కంటె పవన్ మహా ముదిరాడే!



Want create site? Find Free WordPress Themes and plugins.

హీరో పవన్ కల్యాణ్ రాష్ట్ర యాత్రలో రెండు సభలు ముగిసాయి. అటు విశాఖలోను, ఇటు రాజమండ్రిలోనూ ఆయన తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం పూర్తయింది. తనను కాపు కుల నాయకుడిగా గుర్తించడం మీద పవన్ కల్యాణ్ ఈ సమావేశాల్లో తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ప్రజలందరికీ నాయకుడిగా ఎదగాలని, ఎస్టాబ్లిష్ కావాలని కోరుకుంటున్న వ్యక్తికి తొలిదశలో ఇలాంటి కులం ముద్ర పడడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే. అందుకని ఆయన అలాంటి కాపు ముద్రకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం, కోపం వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదు.

కానీ కాపులకు మద్దతుగా ఆయన చెబుతున్న మాటలు మాత్రం మహా చిత్రంగా అనిపిస్తున్నాయి. కాపు రిజర్వేషన్ విషయంలో 15 శాతం వస్తుందని అంతా ఆశించారుట. అయితే 5 శాతం మాత్రమే రావడం అందరినీ నిరాశ పరచిందిట. పవన్ కల్యాణ్ ఈ మాటలు ఏ గణాంకాల ఆధారంగా చెబుతున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని మాత్రమే చెప్పారు. పర్సంటేజీల గురించి ఆయన మాట్లాడలేదు. అయితే కాపులకు 15 శాతం రిజర్వేషన్ వస్తుందని వారు ఎప్పుడు కోరుకున్నారు? ఆ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ వ్యక్తం చేశారు? ఈ విషయాన్ని ఆధారాలతో చెప్పగల స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

కాపుల రిజర్వేషన్ ల గురించి చంద్రబాబుకు కునుకు లేకుండా ఉద్యమాలు చేసిన, అడ్డగోలుగా పోరాడిన ముద్రగడ పద్మనాభం కూడా ఇంత అసమంజసంగా మాట్లాడలేదు. చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత స్పందించిన ముద్రగడ 10 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో 50 లక్షల కాపులు ఉన్నట్లుగా లెక్కలు చెబితే.. ముద్రగడ వద్ద ఆధారాలు లేకపోయినా.. కోటి మంది వరకు ఉన్నారని.. అందువల్ల 10 శాతం ఇస్తే సబబు అని మాత్రమే అన్నారు. కనీసం తప్పో రైటో ఏదో ఒక లెక్క చెప్పి 10 శాతం డిమాండ్ చేశారు. మరి పవన్ కల్యాణ్ ఏ లెక్కల ప్రకారం 15 శాతం వస్తుందని కాపులకోసం అడుగుతున్నారు.

కాపులకు 15 శాతం రిజర్వేషన్ కావాలని పవన్ కల్యాణ్ అనుకున్నాడేమో తెలియదు? ఆ మేరకు ఆయన చంద్రబాబును అడిగాడేమో తెలియదు? ఈ సందర్భంలో తప్ప గతంలో ఎన్నడూ ఆయన కాపుల రిజర్వేషన్ గురించి చిన్న అనుకూల ప్రకటన కూడా చేయలేదు. కనీసం కాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కావాలనే కోరిక ఉన్నదని గతంలో ఎన్నడూ మాట్లాడకుండా, ప్రస్తావించకుండా.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టే కాపులను ప్రసన్నం చేసుకునే వ్యూహానికి ఆయన ఎందుకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవాలి.

అలాగే.. 5 కోట్ల జనాభాలో 50 లక్షలు ఉన్న కాపులకు 15 శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తే.. మిగిలిన కులాలు ఏమైపోతాయో.. ఏయే కులాలకు ఎంతెంత రిజర్వేషన్ ఇవ్వాలో కూడా పవన్ కల్యాణ్ చెబితే చాలా సబబుగా ఉంటుంది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*