చంద్రబాబు వచ్చాక గానీ నమ్మడానికి వీల్లేదంతే!



Want create site? Find Free WordPress Themes and plugins.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఎలాగ? అనుకున్న తరహాలో 2018 సంవత్సరాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా? ఇలాంటి మీమాంస ప్రజల్లో చెలరేగుతున్న తరుణంలో.. చంద్రబాబునాయుడు కొన్నిరోజుల కిందట అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వెల్లడించిన తర్వాత.. కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి మీద అసంతృప్తిని వెళ్లగక్కిన తర్వాత.. కేంద్రంలో కాస్త కదలిక వచ్చినట్లుగా భావించాలి. మంగళవారం పోలవరం పనుల మీద ఉన్నతస్థాయి సమావేశాన్ని గడ్కరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశం ముగిసే సమయానికి చేసిన ప్రకటనల్ని బట్టి, పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తి భరోసా ఇస్తున్నదని.. పనుల పూర్తికి కట్టుబడి ఉన్నదని.. కాంట్రాక్టర్లను ఫాలోఅప్ చేయడానికి స్వయంగా గడ్కరీనే రంగంలోకి దిగుతున్నారని, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆయన పోలవరం విజిట్ చేసి మరీ పనులు పూర్తిచేయిస్తారని అర్థం అవుతోంది.

కానీ ఇవన్నీ నాయకులు చేసిన ప్రకటనలు మాత్రమే. కార్యాచరణలో ఈ హామీల పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే నమ్మడానికి వీల్లేదని పలువురు భావిస్తున్నారు. పోలవరం పనులు ముందుకు సాగడానికి సంబంధించి.. మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం జరిగిన మాట నిజమే. కానీ కీలక నిర్ణయాలు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నది పలువురి వాదన. ఎగువ కాఫర్ డ్యామ్ సంగతి ఏమిటనేది ఇంకా తేల్చలేదు. దీని అధ్యయనానికి కమిటీ సత్వరం వెళ్లి వచ్చి నివేదిక ఇవ్వాలి అని గడ్కరీ హుంకరిస్తున్నారే తప్ప.. కాఫర్ డ్యామ్ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి అనే హామీ ఇవ్వలేదు. పైగా కాఫర్ డ్యామ్ అవసరమా కాదా? అనే విషయంలో తామేం చేయబోతున్నామో ఎప్పటిలోగా క్లారిటీ ఇస్తాం అనే ప్రకటన కూడా లేదు. అలాగే కొత్తగా పిలిచిన టెండర్ల విషయంలో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించలేదు. చంద్రబాబునాయుడు కొరియా పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఆ విషయాలను కూలంకషంగా మాట్లాడి నిర్ణయిస్తాం అన్నట్లుగా గడ్కరీ ముక్తాయించారు.

ఏతావతా.. మంగళవారం నాడు పోలవరంపై కేంద్రం నిర్వహించిన సమావేశం.. కేవలం.. తమ మీద జరుగుతున్న దుష్ప్రచారం నుంచి కాస్త కాపాడుకోవడానికి పెట్టిన ఎత్తుగడ తప్ప… వాస్తవంలో ప్రాజెక్టు మీద శ్రద్ధతో ప్రాజెక్టు పనులకు ఉపయోగపడడం కోసం నిర్వహించిన సమావేశం కానే కాదనే అభిప్రాయమే పలువురిలో వ్యక్తం అవుతోంది. అసలిప్పుడు గడ్కరీ సర్కారు అందించిన హామీల్లో ఎన్ని నిర్దిష్టమైనవో.. ఎన్నింటిద్వారా.. పనులు నెరవేరే అవకాశం ఉన్నదో వేటివలన నిజంగానే పనుల్లో పురోగతి ఉంటుందో.. ఏమీ ప్రస్తుతానికి స్పష్టత లేదు. చంద్రబాబునాయుడు వచ్చిన తరువాత.. గడ్కరీతో మరోసారి సమావేశం అయిన తర్వాత గానీ.. ఇవేవీ తేలేలా కనిపించడం లేదు. పైగా చంద్రబాబునాయుడు సభలో చెప్పినట్లుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులోనే 3000 కోట్లకు పైగా కేంద్రం చెల్లించాల్సి ఉంది.. అలాంటి నిధుల విడుదల గురించి వారి పూచీ ఏమిటో కూడా గడ్కరీ ముడివిప్పలేదు. ఏదో మమ అనిపించడానికి ఒక సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నట్లుగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*