ట్రంప్ కుమార్తెనా.. మజాకా…



Want create site? Find Free WordPress Themes and plugins.
హైదరాబాద్ రోడ్ల మీద ఉన్న బిచ్చగాళ్లను తరలించారు. ఇప్పుడు ఏకంగా జనాలను ఇంట్లో నుంచే రావొద్దంటున్నారు. అమెరికా ప్రెసిడెంట్ గారి అమ్మాయి వస్తుంది. అందుకే ఈ రేంజ్ భద్రత అంటున్నారు. ఆమె రాక కోసం హైదరాబాద్‌లో మాత్రం బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27,28,29 తేదిల్లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదిక కాబోతోంది. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇవాంకా తన 2 రోజుల పర్యటనలో పాతబస్తీలోని చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సందర్శిస్తుంది. ఇవాంకాకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఫలక్‌నుమా ప్యాలెస్ చుట్టూ ఉన్న కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
                        ఫలక్‌నుమా ప్యాలెస్‌, మాదాపూర్‌లోని వెస్టిన్‌ హోటల్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. 27, 28 తేదిల్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌ చుట్టూ ఉన్న 3 కాలనీల్లో గ్రేహౌండ్, ఆక్టోపస్ బలగాలతో పాటు అమెరికాకు చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌, యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ కూడా భద్రతను పర్యవేక్షిస్తాయి. ఫలక్‌నుమా ప్యాలెస్ సిబ్బందికి కూడా పోలీసులు ఇష్యూ చేసిన పాస్‌లు ఉంటేనే లోపలికి అనుమతి. లేకపోతే అంతే సంగతులు. ఫలక్‌నుమా ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న ఫాతిమానగర్, ఫారుఖీనగర్, అల్ జుబైల్ కాలనీల్లో పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇళ్లల్లో నివసిస్తున్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను రికార్డు చేశారు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు… ఎవరెవరు ఏం చేస్తున్నారు… విదేశాల్లో ఎవరైనా ఉన్నారా… కొత్తగా ఎవరైనా వచ్చారా లాంటి వివరాలన్నీ సేకరించారు. కొద్ది రోజుల క్రితం తెలియని వారికెవరికైనా ఇల్లు అద్దెకు ఇచ్చారా ఈ మధ్య ఎవరైనా బంధువులు వచ్చారా లాంటి విషయాలన్నీ ఆరా తీస్తున్నారు. 
                    ఇవాంకా తన 2 రోజుల పర్యటనలో మైండ్ స్పేస్‌లోని వెస్టిన్ హోటల్‌లో బస చేస్తారు. దీంతో భారీ ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. హోటల్‌కు నలువైపులా కిలోమీటరు దూరం వరకూ ఉన్న వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్స్ ప్రతినిధులు, ఐటీ సంస్థల యజమానులు, ప్రతినిధులతో పోలీసులు ఇప్పటికే సమావేశమై ఆంక్షల సంగతి చెప్పారు. ఇవాంకా రాకతో వెస్టిన్‌ హోటల్‌, ఫలక్‌నుమా ప్యాలెస్ చుట్టుపక్కల 3 రోజుల ముందు నుంచే భద్రతాపరమైన ఆంక్షలుంటాయని అందరూ సహకరించాలని పోలీసులు పరిసర ప్రాంతాల వారికి చెప్పేశారు. వెస్టిస్‌ హోటల్‌ ప్రాంతంలో ఫెడరల్‌ బ్యూరో టీమ్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వెస్టిన్‌ హోటల్‌కు 3 వైపులా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే కసరత్తు ముమ్మరం చేసింది. ఇంకోవైపు రహేజా ఐటీ పార్కులోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వివరాలు కూడా పోలీసులు సేకరించారు. ఐటీ సంస్థలు వినియోగిస్తున్న వెహికిల్స్ నెంబర్లను తీసుకున్నారు. ఇవాంకా పర్యటన పూర్తయ్యేంత వరకూ కొత్త ఉద్యోగులను చేర్చుకున్నా, మరమ్మతులు చేపట్టినా, వాహనాలను మార్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఐటీ సంస్థలకు చెప్పారు. 
                      ఫలక్‌నుమా ప్యాలెస్‌ చుట్టుపక్కల భద్రత కోసం గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ బృందాలు ఈ నెల 25న నగరానికి రానున్నాయి. వెస్టిన్‌ హోటల్‌ను అమెరికా భద్రతాధికారులు ముందే స్వాధీనం చేసుకుంటారని పోలీసులు తెలిపారు. ప్రత్యేక డాగ్ స్క్వాడ్ కూడా రానుంది. మొత్తం 3500 మంది పోలీసులు ఫలక్ నుమా ప్యాలెస్ చుట్టూ ఉన్న 3 కాలనీల్లో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్, కౌంటర్ ఇంటలిజెన్స్.. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో ఉండి భద్రతను పర్యవేక్షిస్తారు.
                   ఇవాంకా రావడం ఏమోగానీ… భద్రత మాత్రం ఓ రేంజ్ లో ఉండటం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*