స్నేహమేరా జీవితం సినిమా రివ్యూWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.5/5
నటీనటులు : శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య తదితరులు
రచన, దర్శకత్వం : మహేష్ ఉప్పుటూరి
నిర్మాత : శివబాలాజీ
సంగీతం : సునీల్ కశ్యప్
ఫోటోగ్రాఫర్ : భరణి ధరన్
పరిచయ వ్యాఖ్యలు…
శివబాలాజీ. బిగ్ బాస్ షో ముందు వరకు ఆయన గురించి అంతగా చాలా మందికి తెలియదు. కానీ ఆ తర్వాత అందరికీ సుపరిచతమే. అందుకే శివబాలాజీ కెరీర్ ను బిగ్ బాస్ కు ముందు. ఆ తర్వాత అని చెపాల్సి వస్తోంది. కెరీర్ ఆరంభంలో హీరో పాత్రలు చేసి.. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమయ్యాడు నటుడు శివబాలాజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘కాటమరాయుడు’లో తమ్ముడి పాత్రలో నటించి మెప్పించాడు. ఆ సినిమా తర్వాత పవన్‌కు శివబాలాజీ నిజమైన తమ్ముడిలా మారాడేమో అనిపిస్తోంది. ‘కాటమరాయుడు’తో మంచి పేరు సంపాదించిన సమయంలోనే ‘బిగ్ బాస్’ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడంతోనే ఆయన గెలిచాడంటారు. ఆ సంగతి తర్వాత మొత్తంగా శివబాలాజీ హీరోగా నటించి… స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన సినిమా ‘స్నేహమేరా జీవితం’. పెద్ద సినిమాలు ఏవి లేని సమయం చూసి రిలీజ్ చేశాడు. ఈ మూవీ సక్సెస్ అయిందా లేదా.. వాస్తవ పరిస్థితి ఏంటనే చూసే ప్రయత్నం చేద్దాం…
కథలోకి వెళితే…
1980వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ‘స్నేహమేరా జీవితం’. మోహన్ (శివబాలాజీ), చలపతి (రాజీవ్ కనకాల) మంచి స్నేహితులు. మోహన్ అనాథ. చలపతి అనే కొంచెం డబ్బు, పొగరు ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో రాణించాలనే తపనతో రగిలిపోతుంటాడు. వారిద్దరి మధ్య జరిగే ఆసక్తికర అంశాలే మొత్తం సినిమా. తమ మధ్య అంతరాల్ని పక్కన పెట్టేసి మంచి స్నేహితులుగా కొనసాగుతుంటారు వాళ్లు. మోహన్.. చలపతికి చెందిన కట్టెల డిపోలో పని చేస్తుంటారు. వీళ్లిద్దరి స్నేహం సాఫీగా సాగిపోతున్న సమయంలోనే ఆసక్తికర మలుపు తిరుగుతోంది. మోహన్‌ ఓ అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి కూడా అతడిపై ఇష్టం పెరుగుతోంది. కానీ ఆ అమ్మాయి చలపతితో కలిసి ఉండటాన్నిచూశారు మోహన్. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో స్నేహితుడు ఇలా ఉన్నాడేంటని కోపం పెంచుకుంటాడు.  చూడకూడని పరిస్థితుల్లో చూసి రగిలిపోతాడు. స్నేహంకు విలువ ఇదేనా అని అనుకోవడమే కాదు చలపతి పై కసి పెంచుకుంటాడు. తన స్నేహితుడిపై కోపంతో మరో ఊరు వెళతాడు. అక్కడా కొన్ని గొడవల్లో తలదూర్చి ఇబ్బందులు తెచ్చుకుంటాడు. ఫలితంగా మోహన్ జీవితం కీలక మలుపులు తిరుగుతుంది. ఈ పరిస్థితుల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు.. నిజంగా మోహన్‌‌కు చలపతి అన్యాయం చేశాడా.. వీళ్లిద్దరూ చివరికి కలిశారా లేదా అన్నది ‘స్నేహమేరా జీవితం’ కథ. 
మిగతా అంశాలు…
నాలుగు దశాబ్దాలు వెనక్కి  వెళ్లి అప్పటి నేపథ్యంలో  ఓ కథను ఆసక్తికరంగా చెప్పడమంటే మాటలు కాదు. అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాలి. ప్రేక్షకులకు ఒక ఫీల్ తీసుకురావాలి. అదే సమయంలో బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకోవాలి. ‘స్నేహమేరా జీవితం’ దర్శకుడు మహేష్ ఉప్పుటూరి పరిమిత బడ్జెట్ తో 1980ల నాటి వాతావరణాన్ని అందంగా చూపించాడు. మంచి ఎమోషనల్ టచ్ ఉన్న కథను ఆసక్తికరంగా చెప్పాడు. రెండు గంటలకు పైగా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగాడు. స్నేహం నేపథ్యంలో అందరూ రిలేట్ చేసుకోగలిగే కథ.. జీవం ఉన్న పాత్రలు, నటీనటుల చక్కటి అభినయం ఉన్న మూవీ ఇది. ‘స్నేహమేరా జీవితం’ ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ ను ఇస్తుంది.
నటనా తీరు…
ఈ చిత్రంలో హైలైట్‌గా చెప్పుకోవాల్సిన అంశం 80వ దశకం నాటి వాతావరణాన్ని చూపించడమే. సినిమాలో ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం బాగానే ఉంది. మన చుట్టూ ఉన్న మనుషుల్నే తెర మీద చూస్తున్నట్లు అనిపిస్తోంది. శివబాలాజీ, రాజీవ్ కనకాల పాత్రలు చాలా బాగా అనిపిస్తాయి. ఇద్దరూ కూడా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాను తమ భుజాల మీద నడిపించారు. హీరోయిన్ సుష్మ యార్లగడ్డ ఆద్యంతం  రెండు జళ్ళతో కనిపిస్తోంది. అచ్చమైన తెలుగందంతో ఉంది. కానీ పెద్దగా ఆమెకు పాత్ర లేదు. చిత్రమైన దొంగ పాత్రలో సత్య బాగా నటించాడు. సత్య పాత్ర పంచే వినోదం సినిమాలో హైలెట్ అనే చెప్పాలి. ఇక స్నేహితులుగా చేసిన శివబాలాజీ, రాజీవ్ కనకాల మధ్య బంధాన్ని ఇంకాస్త బలంగా చూపిస్తే బావుండేది. 
                        శివబాలాజీ మరో ఊరు వెళ్లాక అంతా కథ మోహన్ చుట్టూనే తిరిగింది. అప్పుడు చలపతి ఏం చేస్తున్నాడు. ఏంటనేది చూపిస్తే బావుండేది. కానీ స్నేహితుల మధ్య అపార్థం చోటు చేసుకుంటే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ‘స్నేహమేరా జీవితం’లో కథను మలుపు తిప్పేది..  కథను నడిపించేది అదొక్క పాయింటే. తొలి భాగంలో పాత్రల పరిచయం, వాటి గురించి కథలోకి తీసుకెళ్లడం, లవ్ స్టోరీ..  కామెడీ సీన్స్‌తో సరదాగా, వేగంగా సాగిపోతుంది. సెకండాప్ వచ్చే సరికి ఎమోషనల్‌గా  సాగుతుంది. యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సెకండాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించింది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. సినిమాలోని పాత్రలు వాటి మధ్య జరిగే సంభాషణలు చాలా సహజంగా,
మనలను ఆలోచించేలా ఉంటాయి. 
సాంకేతికాంశాలు…
కెమెరా పనితనం బాగుంది. నేపథ్యానికి తగ్గట్లు మ్యూజిక్ కుదిరింది. సునీల్ కశ్యప్ పాటల్లో రెండు మూడు బాగున్నాయి. అన్నింట్లోకి మెల్లగా మెల్లగా అంటూ సాగే మెలోడీ అదిరింది. జ్యోతి లక్ష్మి, జయమాలినిలను గుర్తు చేసే రెండు పాటలు సినిమాలో ఉన్నాయి. కాకపోతే మరింతగా సంగీతం ఉంటే బావుంటుందనిపిస్తోంది. పాటలు బయటకు వచ్చాక పెద్దగా గుర్తుండవు. హీరోలిద్దరికీ తగినట్లుగా విలన్లు ఇందులో లేకపోవడం లోటే. కథ కొన్ని సార్లు నత్తనడకతో పోటీ పడుతోంది. ప్రధాన పాత్రల మధ్య స్నేహ బంధాన్ని ఇంకొంచెం బలంగా చూపించాల్సింది. 
                      శివబాలాజీ, రాజీవ్ కనకాల ఇద్దరూ బాగా నటించారు. మెప్పించారు. డైలాగ్ డెలివరీ బాగుంది. మహేష్ ఉప్పుటూరి రచయితగా, దర్శకుడిగా తన పనితనం చూపించాడు. కాకపోతే ఇంకాస్త రాటుదేలాలని కొన్ని సీన్స్ ను చూస్తే అర్థమవుతోంది. పాత్రల్ని తీర్చిదిద్దుకున్న తీరులో, సంభాషణల విషయంలో సహజత్వం ఉంటోంది. సినిమా నిడివి తక్కువే. నిర్మాతగా శివబాలాజీ అడుగు పెట్టడం సాహసమే అని చెప్పాలి. ట్రైలర్ చూసి ఒక అంచనాతో వచ్చే ప్రేక్షకుల్ని ఈ సినిమా పర్వాలేదనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు శివబాలాజీకి మంచి సపోర్టుగా నిలుస్తున్నారు. కొన్ని చోట్ల వారే శివబాలాజీకి బ్యానర్ లు కట్టడం విశేషం. 
ప్లస్ పాయింట్లు
+ శివబాలాజీ, రాజీవ్ కనకాల నటన
+ సహజత్వం
+ కెమెరా పనితనం
+ స్నేహం సెంటిమెంట్
మైనస్ పాయింట్లు
– ఆకట్టుకోని సంగీతం
– సెకండాఫ్ లో నెమ్మదించిన కథ
– కథనంలో లోపాలు
– దర్శకత్వం
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*