గరుడ వేగ మూవీ రివ్యూ…Want create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.75/5
నటీ నటులు : రాజశేఖర్‌, పూజా కుమార్‌, శ్రద్ధాదాస్, నాజర్‌, పోసాని కృష్ణమురళీ, కిశోర్‌, అదిత్‌ అరుణ్‌, సన్నీ లియోన్ తదితరులు
సంగీతం : భీమ్స్‌ సిసిరోలియో, శ్రీచరణ్‌ పాకాల
నిర్మాత : ఎమ్‌. కోటేశ్వర రాజు
దర్శకత్వం : ప్రవీణ్‌ సత్తారు
పరిచయ మాటలు..
యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా నటించిన సినిమాలు హిట్ అయి చాలా ఏళ్లు అయింది. అందుకే ఈ సారి మరింత శ్రద్ద పెట్టి మరీ ఈ సినిమా చేశారు రాజశేఖర్. మొదటి నుంచి గరుడవేగా మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఎన్నడు లేనిదీ రాజశేఖర్ ఆడియో వేడుకలో చాలా ఎమోషనల్ గా కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా జనాన్ని బాగా కదిలించింది. మరోవైపు చందమామ కథలు, గుంటూరు టాకీస్ సినిమాలతో ప్రవీణ్ సత్తార్ తన సత్తా చాటాడు. కాబట్టి మూడో సినిమా సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. వాస్తవంగా ఈ సినిమాలో హాలీవుడ్ టైప్ సన్నివేశాలు ఉంటాయని అంచనా వేశారు. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తోంది. వాస్తవంగా ఈ సినిమా అలాంటి అంచనాలు అందుకుందా..లేదా అనేది చూద్దాం…
 
కథలోకి వెళితే….
చంద్రశేఖర్(రాజశేఖర్) ఒక సిన్సియర్ ఎన్ఐఎ ఆఫీసర్. కుటుంబాన్ని పక్కనపెట్టి మరీ డ్యూటీ చేస్తుంటాడు. ఈ క్రమంలో భార్య స్వాతి ( పూజాకుమార్ )ను పెద్దగా పట్టించుకోడు. ఇలాంటి క్రమంలో ఆమె విడాకులకు సిద్దమవుతోంది. ఇక లాభం లేదనుకున్న చంద్రశేఖర్ ఇంటికి వచ్చే క్రమంలో కీలక ఘట్టాలు చోటు చేసుకుంటాయి. ఓ హత్య కేసు విచారణ చేస్తుంటే ఎప్పుడో చనిపోయాడు అనుకున్న యాకూబ్ అలీ (శత్రు) ఆచూకీ దొరుకుతుంది. అతన్ని పట్టుకునే క్రమంలో యాకూబ్ చనిపోతాడు. కానీ కీలకమైన పాత్రధారి నిరంజన్ (అదిత్ అరుణ్) అతని చేతికి చిక్కుతాడు. జైలు మార్చే క్రమంలో ఇద్దరి మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. దాంతో షాక్ తిన్న చంద్రశేఖర్ కు నిరంజన్ ద్వారా అతి పెద్ద కుంభకోణం లింక్ దొరుకుతుంది. 
       జార్జియాలోని బైక్‌ ఛేజింగ్‌, డ్యామ్‌ నేపథ్యంలో వచ్చే దృశ్యాలు ఆసక్తిని రేపుతాయి. నిరంజన్‌ చుట్టూ కథ బాగానే నడుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్‌రెడ్డి(పోసాని కృష్ణమురళి)ని చంపడం కోసం  పెట్టిన బాంబును నిర్వీర్యం చేయడం అక్కడే నిరంజన్‌ని పట్టుకోవడం వంటి సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌. సెకండాఫ్ లో తుమ్మలపల్లి మైనింగ్‌, ప్లుటోనియం ఎగుమతిని చర్చిస్తూ కథను నడిపిన తీరు కాస్తంత గందరగోళంగా ఉంది. నిరంజన్‌-చంద్రశేఖర్‌ల మధ్య కొన్ని సన్నివేశాలు గుర్తుకు రావు. ప్రధాన ప్రతినాయకుడిగా జార్జ్‌(కిషోర్‌) పాత్రను తెరపై మరింత ఎఫెక్టివ్‌గా చూపిస్తే బాగుండేదనిపిస్తోంది. అందులో రూలింగ్ పార్టీ మినిస్టర్లు, కొందరు అధికారులకు స్కాంలో పాత్ర ఉన్నట్లు గుర్తించిన చంద్రశేఖర్ వాటిని ఎలా చేధిస్తాడు అన్నదే కథ…
నటన తీరు…
       
రాజశేఖర్‌కు ఇది మంచి సినిమా. చాలా కాలం తర్వాత తాను మాత్రమే చెయ్యగలిగే పాత్ర  ఆ హీరోకు దక్కింది. నటనలో తన సత్తా ఉందని మరోసారి రాజశేఖర్ చాటాడు. గతంలో ఉన్న కళ ఇప్పుడు రాజశేఖర్ లో కనిపించదు. అయినా చక్కని పాత్రలో చూసిన ఫీలింగ్ ఇస్తాడు. విలన్ అనుకున్న కిషోర్ పాత్ర కంటే సైడ్ ట్రాక్ లో ఉన్న పోసాని పాత్రే ఎక్కువ ఉంది. ఫలితంగా కొంచెం నిరాశ కలిగించినా కథా పరంగా కరెక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ పూజా కుమార్ అనుకున్నంత మేర రాణించలేదనే చెప్పాలి. సాదా సీదాగానే చేసిందా భామ. హీరో పక్కనే ఉంటూ అప్రూవర్ గా మారిన పాత్రలో అదిత్ అరుణ్ బాగా చేశాడు. శ్రద్ధా దాస్ రెగ్యులర్ టీవీ రిపోర్టర్ పాత్రనే. ఇక నాజర్, పోసాని, షియాజీ షిండే, ఆలీ ఎవరికి వాళ్ళు తమ సపోర్టింగ్ రోల్స్ ని మెప్పించారు. కొత్తదనం ఈ పాత్రల్లో పెద్దగా లేదనే చెప్పాలి. 
సాంకేతికాంశాలు…
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఇందులో అనుమానం లేదు. అతనిలో ఉన్న ఉత్తమ టెక్నీషియన్ ఇందులో బయటకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్పీడ్ గా సాగింది. హాలీవుడ్ స్టైల్ ను గుర్తుకు తెప్పించింది. కానీ ప్రవీణ్ సెకండ్ హాఫ్ లో కొంత తడబాటుకు గురైనట్లు అర్థమవుతోంది. ఐటెం సాంగ్ పెట్టడం, క్లైమాక్స్ కి ముందు హీరో అతని భార్య మధ్య బలవంతపు కామెడీలు వర్క్ అవుట్ కావు. సినిమా మరీ సీరియస్ గా వెళ్తోందనే అనుమానంతో కామెడీ రోల్ పెట్టడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని గ్రహించలేదు. కొన్ని సార్లు కామెడీ నవ్వు పుట్టించకపోగా చిరాకు తెప్పిస్తుంది. కానీ యాక్షన్ సన్నివేశాల్లో ప్రవీణ్ సత్తార్ ప్రతిభకు తిరుగులేదు. తాను ఎవరికి తీసిపోనని నిరూపిస్తాడు. ప్రీ ఇంటర్వెల్ లో చార్మినార్ దగ్గర షూట్ చేసిన ఎపిసోడ్ ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు. 
         కెమెరా టీం అంజి, సురేష్, శ్యామ్ తదితరులు చాలా బాగా తమ వర్క్ మీద దృష్టి పెట్టారు. శ్రీచరణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. ఫస్ట్ లో వచ్చే భార్యాభర్తల పాట అనవసరం అనిపిస్తే సెకండ్ హాఫ్ లో సన్నీ లియోన్ సాంగ్ మాస్ కోసమే అని అనుకోవచ్చు. ధర్మేంద్ర ఎడిటింగ్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఇంకా షార్ప్ గా ఉండాలి. మాస్ అప్పీల్ పెద్దగా లేదనిపిస్తోంది. కోటేశ్వర్ రాజు నిర్మాణ విలువలు చాలా రిచ్ గానే ఉన్నాయి. కథను నమ్మి హీరో ఇమేజ్ ని పట్టించుకోకుండా ఇంత బడ్జెట్ పెట్టడం మామూలు విషయం కాదు.
         గరుడవేగా కమర్షియల్ గా ఎంత హిట్ తెస్తుందో తెలియదు కానీ..ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా ప్రమాణాలను పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కథనం మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. ప్రవీణ్ సెకండ్ హాఫ్ లో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ అవకాశం పోయింది. అయినా గరుడవేగా తీసేసే సినిమా కాదు. మేకింగ్ లో మన స్టాండర్డ్స్ ఎలా పెరుగుతూన్నాయో చూడడానికైనా గరుడవేగాను చూడొచ్చు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*