అప్పుడే రేగిన అసెంబ్లీ సమావేశాల కాకWant create site? Find Free WordPress Themes and plugins.
ఎన్నికలకు ముందే రాజకీయ కాక రేగుతోంది. ఎత్తులకు పై ఎత్తులు పడుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని విపక్షాలు. విపక్షాలను ధీటుగా ఎదుర్కునేలా అధికార పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఫలితంగా అసెంబ్లీ సమావేశాలకు ముందే రాజకీయ వేడి రగులుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఎక్కువగా ఉంది. అసెంబ్లీ సమావేశాలకు తేదీలను ప్రకటించడమే ఇందుకు కారణం. తెలంగాణలో అక్టోబర్ 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోపే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అన్ని పార్టీలను ఆలోచనలో పడేసింది. హస్తినకు వెళ్లి మరీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసాడు. తనతో పాటు.. వీలున్నంత ఎక్కువ మంది తీసుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నాడు. మరోవైపు రేవంత్ రెడ్డి రాకతో తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారు హస్తం పార్టీ నేతలు. విషయం ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణల్లో హాట్ టాపికైంది. 
                      తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల పాటు జరపాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. అందుకే వర్షాకాలం, శీతాకాలం సమావేశాలను కలిపి నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డినే కాదు.. మిగతా వారిని ధీటుగా ఎదుర్కునే కసరత్తు చేస్తోంది గులాబీ పార్టీ. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించనుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పాటు.. ప్రభుత్వ పథకాలను ప్రస్తావించనుంది. మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తావించేందుకు విపక్షాలు అస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. దసరా పండుగ నాడు ఆడపడుచులకు పంచిన చీరలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ పై విపక్షాలు దూకుడు మంత్రాన్ని ప్రయోగించనున్నాయి. అక్టోబర్ 26న జరగబోయే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే విషయం పై సమాలోచనలు జరపనున్నారు. ఆ తర్వాత అధికారిక షెడ్యూల్‌ను విడుదల కానుంది. 
కేసీఆర్ కసరత్తు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వ్యవహరించాల్సిన వ్యూహం పై చర్చించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఏకకాలంలో జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పాలని సీఎం మంత్రులకు సూచించారు. హైదరాబాద్‌లో వచ్చే నెల ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి.  తెలుగు భాషకు తెలంగాణ ప్రభుత్వం ఎంత గుర్తింపునిస్తుందో తెలియజెప్పాలని సీఎం అధికారులకు చెప్పారు. ఇంటర్మీడియట్ వరకూ తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పక్కగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీలు మూకుమ్మడిగా అధికార పార్టీ తీరును ఎండగట్టే పని చేయనున్నాయి. 
అమరావతిలో….
ఆంధ్రానగరి అమరావతిలో నవంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయినా బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకూ జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకాంశాలపై చర్చించనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సి.ఎం. చంద్రబాబునాయుడు ఈనెల 27న తిరిగి రానున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో కసరత్తు చేయనున్నారు. అమెరికా, దుబాయ్, లండన్ లలో చంద్రబాబు పర్యటిస్తున్నసంగతి తెలిసిందే. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని.. ఇక్కడకు రావాలని ఎన్నారైలతో పాటు.. వివిధ దేశాల అధినేతలు, కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. సానుకూలమైన ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకు వచ్చే వీలుంది. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకునేందుకు రూ.40 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా ఏపీఎన్ఆర్టీని ఏర్పాటు చేయడమే కాదు.. ఆ సంస్థను మరింత క్రియాశీలకం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు. అలానే మూడో విడత రైతు రుణమాఫీ, డ్వాక్రా గ్రూపులకు రుణాలు, పట్టిసీమ ద్వారా నీళ్లు, పోలవరం ప్రాజెక్టు పురోగతి పైనా చర్చించే వీలుంది. ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రస్తావించనున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలు కావడంతో టీడీపీలో ఉత్సాహం నెలకుంది. అదే సమయంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో పాటు.. మరికొందరు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.  
జగన్ ఏం చేస్తాడో….
వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ముందే ప్రకటించారు. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవచ్చు. కోర్టు ఇందుకు అనుమతి ఇచ్చినా.. ఇవ్వక పోయినా యాత్ర చేసి తీరాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో సి.బి.ఐ కోర్టు తన తీర్పును రిజర్వు చేసిపెట్టింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి యాత్రను వాయిదా వేసుకోవాలని వైకాపా సీనియర్లు పలువురు జగన్ కు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల దూరం జగన్ పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నాడు. అదే సమయంలో జగన్ యాత్రకు కోర్టు అనుమతిని ఇవ్వక పోతే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటోంది. అది జగన్ పార్టీకి ఇబ్బందే. రేవంత్ రెడ్డి రూపంలో వైకాపాకు ఇప్పుడు అస్త్రాలు వచ్చినట్లు అయింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.2 వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టును తెలంగాణ సి.ఎం కేసీఆర్ నుంచి తీసుకున్నారనేది రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ. మరోవైపు మంత్రి పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లు బీర్ల ప్యాక్టరీ లైసెన్స్ ల కోసం కేసీఆర్ తో మంతనాలు చేశారనేది మరో ఆరోపణ.  దీనిపై టీడీపీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావించి అధికార పార్టీని ఇరుకున పెట్టే వ్యూహంతో వైకాపా శ్రేణులు ఉన్నాయి. 
జంప్ జిలానీలు…
ఇప్పటికే 21 మంది వైకాపా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్సీలు జగన్ పార్టీని వీడి టీడీపీ పంచన చేరిన సంగతి తెలిసిందే. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. మరికొంత మంది పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారిని చేర్చుకునేందుకు సి.ఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే జగన్ పార్టీకి ఇబ్బందే. పార్టీ నేతలను కాపాడుకోవాల్సిన పరిస్థితిలోకి విపక్షం వెళుతోంది. ఫలితంగా రాజకీయ వేడి రగలడం ఖాయం. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే.. కాస్తంత రాజకీయ కాక ఉంటోంది. లేకపోతే అధికార పార్టీ చాలా నిశ్చింతగా తన పని తాను చేసుకుపోతుందన్నది  వాస్తవం. ఇక బీజేపీ టీడీపీ భాగస్వామ్య పార్టీ కాబట్టి పెద్దగా ఆ పార్టీ నుంచి ఇబ్బందులు ఉండకపోవచ్చు. విష్ణుకుమార్ రాజు లాంటి వారు అడపాదడపా ప్రశ్నలు అడగడం మినహా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పని ఎప్పుడూ చేయలేదు.  ఫలితంగా అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి వచ్చే నష్టం లేకపోవచ్చు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*