గడ్కరీ జీ! మాట నిలబెట్టుకోవడం ముఖ్యం!



Want create site? Find Free WordPress Themes and plugins.

ప్రియమైన గడ్కరీ గారూ…

ఎవరైనా మరొకరి ఆస్తి గురించి.. ‘ఇది నాది’    అనే మాట వాడితే.. అసలు యజమానులకు చాలా ఆగ్రహం రావడం సహజం. కానీ, మీ విషయంలో ‘‘పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది కాదు.. అది నాది’’ అని మీరు ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రజలుగా మేమంతా చాలా మురిసిపోయాం. ఇది నా సొంత ప్రాజెక్టుగా భావించి పనులు పూర్తి చేయిస్తా అని మీరు సెలవిచ్చినప్పుడు మాకు చాలా సంబరం కలిగింది. ప్రాజెక్టు కూడా మీదే.. మేం కూడా మీ వాళ్లమే… మీ మనుషుల మైన మా బాగుకోసం… మీ ప్రాజెక్టు పోలవరాన్ని మీరు సత్వరం పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటారని ఆశించాం.

కానీ తాజా పరిస్థితులు చూస్తోంటే రకరకాల భయాలు కలుగుతున్నాయి. కాంట్రాక్టరును మార్చి.. త్వరితగతిన పనులు నడిపించడానికి తమరు సుముఖంగా లేరని, తద్వారా పెరిగే ఖర్చుకు ఇష్టపడడం లేదని తెలిసి హతాశులం అయ్యాం. ఈ నత్తనడక కాంట్రాక్టరుతో అసలు జరుగుతుందో లేదో అనే భయాలు ముసురుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేస్తే బాగుంటుందో అధ్యయనం చేసి వివరాలు చెప్పడానికి మీరు కమిటీలను పంపుతున్నారు. ఇది చాలా ఆశావహమైన పరిణామంగా కనిపిస్తోంది.

నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాగపూర్ కు వచ్చి తమర్ని కలిసినప్పుడు.. 23వ తేదీ భేటీ ఏర్పాటుచేసి.. పోలవరం పనుల విషయంలో ఎలా ప్రొసీడ్ కావాలో తేల్చేద్దాం అని తమరు సెలవిచ్చారు. తిరిగి టెండర్లు పిలవడానికి తమరు ఒప్పకుంటారో లేదో గానీ.. 23 నాటికి సమావేశం పెట్టి విషయం తేల్చేస్తారు కదాని మేం సంబర పడ్డాం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా తేలేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఓ కమిటీ పోలవరానికి వస్తోంది. 23, 24 తేదీల్లో వారు ఇక్కడే ఉంటారు. ఇలా వారు రావడం, వారు నివేదిక ఇచ్చాక మరో కమిటీ రావడం.. వారు పరిశీలించిన తర్వాత.. కేంద్రం నిర్ణయం తీసుకోవడం.. ఇలా నివేదికల రూపంలోనే ఏళ్లూ పూళ్లూ గడచిపోతే.. ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తయ్యేను.

చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా.. 2018 సంవత్సరాంతానికి కాదు గానీ.. 2019 ఎన్నికల్లోగా పూర్తి చేస్తా అని మీరు చెప్పారు.  కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భయం పుట్టిస్తున్నాయి. ఈ కమిటీలు అన్నీ కలిపి ఏం తేలుస్తాయో అనే భయం పుడుతోంది. రాష్ట్రప్రభుత్వం మీద నెపం పెట్టకుండా.. కావలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీ మొత్తం తప్పించేసి అయినా సరే.. పనులు మొత్తం మీరే చేపట్టండి. కాకపోతే.. మీ మాట మీరు నిలబెట్టుకునేలా.. పోలవరం ప్రాజెక్టును మాత్రం 2019 ఎన్నికల్లోగా గ్రావిటీతో నీళ్లు ఇచ్చే స్థితికి అయినా తీసుకురండి గడ్కరీ గారూ. దయచేసి తెలుగు ప్రజలను వంచించే మరో ప్రయత్నం చేయకండి..

–     తెలుగు ప్రజలు 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*