మైసూరాకు రాజ్యసభ ఖాయమా



Want create site? Find Free WordPress Themes and plugins.
       కడప జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని నేత మైసూరారెడ్డి. తొలిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైసూరారెడ్డి ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ కొన్నాళ్లు ఉన్నాక..తిరిగి వైసీపీ గూటికి మారారు. అక్కడ సరైన ఆదరణ లేదంటూ మరోసారి తెలుగు దేశం పార్టీలో అడుగు పెట్టేందుకు సిద్దమయ్యారు. వైద్య వృత్తి ని మానేసి 1981 లో రాజకీయాలలోకి ప్రవేశించిన మైసూరా పంచాయితీ ఎన్నికలలో కమలాపురం సమితి ప్రెసిడెంటు గా గెలిచారు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం ఆయనకు కలిసొచ్చింది. ఇండిపెండెంట్ గా గెలిచాక కాంగ్రెస్ పార్టీలో చేరి 25 ఏళ్ల పాటు అదే పార్టీలో కొనసాగారు. 1983 శాసనసభ ఎన్నికలలో ఓడినా 1985, 1989, 1999 ఎన్నికలలో విజయం సాధించారు. 1994లో తెలుగుదేశం అభ్యర్థి వీరశివారెడ్డి చేతిలో ఓటమితో ఆయన కొంత కుంగి పోయారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోం మంత్రిగానూ, నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో రవాణామంత్రిగానూ పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
      టీడీపీలో చేరిన తర్వాత జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికలలో తెలుగుదేశం తరపున పోటీచేసి హ్యాట్రిక్ పరాజయం మూటగట్టుకున్నారు మైసూరారెడ్డి. తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి బయటికివచ్చి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగాను తగిన సలహాలు సూచనలుచేశాడు. దివంగత సి.ఎం వైఎస్ కు వ్యతిరేకంగా టీడీపీలో గట్టి పోరాటమే చేశాడు. ఆతర్వాత టీడీపీని వీడి జగన్ పంచన చేరాడు. గత ఏప్రిల్ లో ఆయన వైకాపాను వీడారు. ఏ పార్టీలోను చేరలేదు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో చేరతాననే సంకేతాలు ఇచ్చారట మైసారా. అందుకే అతన్ని తీసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సిద్దమయ్యారంటున్నారు. ఇప్పటికే అనుచరుల ద్వారా చర్చలు కొనసాగించారు. వాస్తవంగా మైసూరారెడ్డి ఎప్పుడో పార్టీలో చేరేవాడు. ఇందుకు మైసూరా కోడలు అడ్డు పడ్డట్లు తెలుస్తోంది. మైసూరారెడ్డి కోడలు, జగన్ భార్య భారతిలు మంచి స్నేహితురాళ్లు. అందుకే మామ పార్టీ మారే కార్యక్రమానికి అడ్డుగోడగా నిలిచాడంటారు. కానీ ఇప్పుడు అదే కోడలు మైసూరా రెడ్డి రాజకీయ జీవితానికి తాను అడ్డురాకూడదనే ఆలోచిస్తున్నారట. 
        అందుకే టీడీపీలోచేరేందుకు మైసూరా సిద్దమైనట్లు తెలుస్తోంది. మైసూరారెడ్డి పార్టీలో చేరితే ఆ మేరకు వైకాపాకు కడపలో దెబ్బ తగిలే అవకాశముంది. ఇప్పటికే ఆదినారాయణరెడ్డితో పాటు…పలువురు నేతలు పార్టీని వీడటం జగన్ పార్టీకి ఇబ్బంది తెచ్చింది. దివంగత సి.ఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక వైసీపీలో చేరిన మైసూరా తొలి ప్రసంగం నాడు కాస్తంత ఉద్వేగంగా కనిపించాడు. అదే సభలో జగన్ ను తాను కొడుకులాగా భావిస్తానన్నాడు. ఒకవేళ కొడుకు తప్పు చేస్తే తండ్రిలా సరిదిద్దుతానని మాటిచ్చాడు. కానీ అదే తండ్రి లాంటి మైసూరారెడ్డి సిమెంట్ ప్యాక్టరీ కోసం రాజ్యసభ సీటు కోసం పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. 
బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడకు వెళతాయి. అందరికీ తెలిసిన నిజమే ఇది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బెల్లం లాంటి పార్టీ. అధికారం, పదవులు, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పార్టీ. అందుకే అటు స్వామి కార్యం, ఇటు స్వకార్యంలా రెండు పనులు చేసుకునేందుకే మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నాడంటున్నారు. మైసూరా రాజకీయం చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి సిగ్గుపడుతుందనే విమర్శలు చేస్తున్నారు మరోవైపు వైసీపీ నేతలు. అంతలా మైసూరా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, తిరిగి టీడీపీకి ఇలా పార్టీలు మారడం ఆశ్చర్యమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*