నిండుకుండలా కృష్ణమ్మ, పరవళ్లు తొక్కుతూ సాగర్ కు…



Want create site? Find Free WordPress Themes and plugins.
       హమ్మయ్యా. తెలుగు రాష్ట్రాల్లో తాగు, సాగునీటి వెతలు ఈ ఏటికి తీరనున్నాయి. అవసరానికి సరిపడా నీళ్లు వచ్చాయి. మూడేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. పరవళ్లు తొక్కుతూ పొంగి పొర్లుతోంది. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రెండు గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తడంతో గంగ కిందకు పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తోంది. 
       శ్రీశైలం జలాశయ గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇప్పుడు 884.80 అడుగులకు నీరు చేరింది. అది 214.8450 టీఎంసీలకు సమానం. అదే సమయంలో ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,39,007 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పాదన ద్వారా 32,878 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రానికి 42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇంకోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 12,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 338 క్యూసెక్కులు విడుదల చేయడం విశేషం. 
       ఏపీకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణకు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరం. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్‌ దిశగా వడివడిగా పరుగులు తీస్తోంది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో మూడు, నాలుగు రోజుల పాటు ఇలానే  ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*