జగన్ : లక్ష్యశుద్ధి లేని డాంబికపు పోరాటం!



Want create site? Find Free WordPress Themes and plugins.

జగన్ మోహన్ రెడ్డి తీరును గమనిస్తే.. ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించిన పోరాటం నిత్యాగ్నిహోత్రంలాగా రావణకాష్టంలాగా ఎప్పటికీ సాగుతూనే ఉండాలని కోరిక ఉన్నట్లుగా కనిపిస్తున్నది తప్ప.. అది ఏదో ఒక నాటికి ఒక కొలిక్కి రావాలనే కోరిక ఉన్నట్లు తోచడం లేదు. తాను రాష్ట్రం కోసం పరితపించిపోతున్నట్లుగా చాటుకోవడానికి, తన ప్రజాసేవాకాంక్ష గురించి టముకు వేసుకోవడానికి తనకు ఒక ‘టూల్’ (ఉపకరణం) కావాలి. సాధారణంగా లోటస్ పాండ్ భవంతికి మాత్రమే పరిమితమై రోజులు గడిపేస్తూ ఉండే ప్రజానాయకుడు.. తాను సీఎం కావడం మినహా ఈ రాష్ట్రప్రజల కష్టాలు తీరడానికి మరో మార్గం లేదని బలంగా నమ్మే ఈ నాయకుడు తను ప్రజల మధ్యకు రాదలచుకున్నప్పుడు.. రాష్ట్రం కోసం పరితపిస్తున్నట్టు చెప్పుకోడానికి ఒక శాశ్వతమైన కారణం లాగా ప్రత్యేక హోదా పోరాటాన్ని పెట్టుకున్నారు.

హోదా కోసం పోరాడుతున్నాం అంటూ అనంతపురంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జగన్మోహనరెడ్డి ఆటిట్యూడ్ చాలా స్పష్టంగా కనిపించింది. ఆయనలో పోరాడుతా అనే పదం తప్ప.. ఫలితం సాధించాలనే లక్ష్యశుద్ధి లేదనే విషయం కూడా అర్థమైంది.

ముందుగా అసలు జగన్ సాహసానికి మెచ్చుకోవాలి. ‘ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా.. హోదా సంగతి కేంద్రం తేల్చకపోతే మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు’ అని జనం సాక్షిగా ప్రకటించి.. దాదాపు ఏడాది గడుస్తోంది. ఈ ఏడాదిగా ఆ అంశం గురించి పట్టించుకున్నది లేదు. ఇన్నాళ్లు మరచిపోయి… ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చి.. విద్యా సంవత్సరం వచ్చింది.. పరీక్షలు వచ్చాయి.. అందుకే కొన్నాళ్లు పోరాటం పక్కన పెట్టాం, ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నాం.. చివరి అస్త్రంగా రాజీనామా చేయిస్తాం..  అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి.. తాను రాష్ట్ర ప్రజల్ని నమ్మించగలనని ఎలా అనుకోగలిగారో గానీ.. అదే జగన్ సాహసంగా చెప్పాలి.

జగన్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. ఆయన చెబుతున్న ప్రకారం.. ఉప ఎన్నికలను తీసుకువచ్చి.. తిరిగి తమ పార్టీ వారిని గెలిపించి.. ప్రత్యేకహోదా అనే అంశానికి ప్రజల మద్దతు ఉన్నదని, ప్రజల్లో ఆ ఆకాంక్ష ఇప్పటికీ సజీవంగా ఉన్నదని నిరూపిస్తాం అని ఆయన అంటున్నారు.

అదే మాట గనుక నిజమైతే.. ఎన్నికల్లో జగన్ ఈ ఒక్క ఎజెండాతోనే జనం వద్దకెళ్లి గెలిస్తే.. ప్రజల ఆకాంక్ష తేలుతుంది. మంచిదే! కానీ అందుకు ఎంపీలు మాత్రమే ఎందుకు రాజీనామా చేయాలి. జగన్ కు శ్రద్ధ ఉంటే.. తన పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు అందరితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు వెళ్లి.. అందరినీ గెలిపించుకుని.. ఇదంతా ప్రత్యేకహోదా కోసం పడిన ఓట్లు అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక పంపవచ్చు కదా… అనేది పలువురిలో మెదలుతున్న సందేహం. ‘ఎంపీల రాజీనామా’ అనేది జగన్ కు ఒక పడికట్టు పదం అయిపోయిందని పలువురు అనుకుంటున్నారు. జగన్ మాటల్లో ఎక్కడా నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక లేదు. పోరాడుతా అనే మాట చెప్పడం తప్ప.. ఎప్పటిదాకా పోరాడుతాడో.. ఎప్పటిలోగా ప్రభుత్వాలు స్పందించకపోతే.. తన పోరాటాన్ని మలిదశకు ఎలా తీసుకువెళ్తాడో ఏమీ ఆయన చెప్పడం లేదు. నిజానికి ఆయనకు ఆ ఆలోచనే లేదు. ఎంచక్కా.. వచ్చే ఏడాది పొడవునా.. ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నది మా పార్టీ ఒక్కటే.. మాకు తప్ప ఎవ్వరికీ శ్రద్ధ లేదు.. అని మాటలు చెప్పుకుంటూ.. ఏతత్ రూపేణా చంద్రబాబును ఆడిపోసుకుంటూ.. తిరగడమే ఆయన ప్రణాళికగా కనిపిస్తోంది. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*