ప్రవాసాంధ్రుల పై దృష్టి పెట్టిన చంద్రబాబు సర్కారుWant create site? Find Free WordPress Themes and plugins.
ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు (ఏపీఎన్‌ఆర్‌టీ) పాలకమండలి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రవాసాంధ్రుల సంక్షేమం-అభివృద్ధి పాలసీ’ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి వంటి ముఖ్యమైన పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. ఏపీఎన్ఆర్‌టీలో సభ్యులుగా వున్న 42,600 మందికి ఈ పాలసీ ద్వారా బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఏపీఎన్ఆర్‌టీ పాలకమండలి తొలి సమావేశంలోనే సి.ఎం చంద్రబాబునాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
          ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్’ పేరుతో కాల్ సెంటర్‌ అందుబాటులోకి రానుంది. ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం కలిగిన వారికి ‘ప్రవాసాంధ్ర భరోసా’ పథకం కింద రూ.10 లక్షల బీమా కల్పించనున్నారు. విదేశాల్లో ఉద్యోగం-ఉపాధి కోల్పోయినవారికి తక్షణ సాయం కోసం ‘ప్రవాసాంధ్ర సహాయ నిధి’ని రూ. కోటితో ఏర్పాటు చేయనున్నారు. ‘ప్రవాసాంధ్రుల సంక్షేమం-అభివృద్ధి పాలసీ’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ. 40 కోట్లు కేటాయించింది. ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ (ఏపీఎన్ఆర్టీ) వారిసూచనలు సలహాలకు సి.ఎం చంద్రబాబునాయుడు విలువనిస్తున్నారు. అందుకే వారిచ్చిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ఏపీఎన్‌ఆర్‌టీకి విరాళాలు ఇచ్చేవారి కోసం ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా ట్రస్ట్ ఏర్పాటు చేయాలనేది సర్కారు ఆలోచనగా ఉంది. 
         ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. ఏపీఎన్ఆర్‌టీల కోసం హర్యానా తరహాలో స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్, ప్రత్యేక సెల్ వంటివి ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రవాస తెలుగువాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుంది. ఇందుకు అవసరమయ్యే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నయా పైసా ఇవ్వకుండా సభ్యత్వం కల్పించడంతో పాటు ప్రవాసాంధ్రులకు ఏపీఎన్ఆర్‌టీ పలు రకాల సేవలు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల దర్శనాలతో పాటు సుమారు 8 వేల మంది సభ్యులకు పలు సేవలను కల్పించింది. ప్రవాసాంధ్రుల సేవలకు సంబంధించి విస్తృత సమాచారం డ్యాష్ బోర్డులో లభిస్తుంది.
       ఏపీఎన్‌ఆర్‌టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా సుబ్బరాయుడు, రూపారాజు, మహ్మద్ బోరాలను నియమించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మీదట ఏపీఎన్‌ఆర్‌టీ మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి కోరారు. మొత్తం 106 దేశాల్లో సుమారు 30 లక్షల మంది ప్రవాసాంధ్రులు వున్నారని, మార్చి నాటికి సభ్యత్వాల సంఖ్యను లక్ష చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో కోగంటి సాంబశివరావు ముఖ్యమంత్రికి తెలిపారు. ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా వున్న ఇంతమందిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఏపీఎన్ఆర్‌టీ సాధించిన విజయమని తెలిపారు.
అమెరికా పర్యటనలో కలిసే వీలు…
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారం రోజుల పాటు అమెరికా, దుబాయ్, అబుదాబీ వంటి ప్రాంతాలను సందర్శించనున్నారు. అక్టోబర్ 17న అమెరికా వెళ్లే చంద్రబాబు అయోవా రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్టోబరు 18, 19 తేదీల్లో ప్రపంచ ఆహార పురస్కార వేడుకల్లో పాల్గొని అక్కడకు విచ్చేసిన 50 దేశాల ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు. అమెరికాకు చెందిన కొందరు పెట్టుబడిదారులు, వివిధ కంపెనీల ప్రతినిధులతోను చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత అక్టోబరు 20 నుంచి 23 వరకు దుబాయ్, అబుదాబీల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌ఆర్‌టీ పలువురు పెట్టుబడిదారులను చూసి వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రొత్సహించనుంది. అంతే కాదు…చంద్రబాబుతో ఏపీ ఎన్ ఆర్టీ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. 
          ఇప్పటివరకు 32 ఐటీ కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పేలా ఏపీఎన్ఆర్‌టి సభ్యులు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 3,090 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరో 21 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. అప్పుడు మరో 3,390 మంది ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రవాసాంధ్రులకు కావాల్సిన అన్ని రకాల వసతి, సౌకర్యాలతో పాటు..రాయితీలు కల్పించనుంది. ఏపీ సర్కారు. అలానే ఏపీఎన్ఆర్‌టీ కృషితో హైదరాబాద్‌కు చెందిన 75 ఎంఎస్ఎంఈ సంస్థలు తమ యూనిట్లను కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో త్వరలో నెలకొల్పనున్నాయి. దీంతో రాష్ట్రానికి రూ. 200 కోట్ల విలువైన పెట్టుబడులు రావడంతో పాటు, రెండు వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానుండటం విశేషం. 
         ఏపీ మంత్రివర్గం సమావేశంలోను ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అందిస్తున్న సేవల పైనా చర్చించారు. అందుకే ముందుగా రూ. 40 కోట్లను ప్రవాసాంద్రుల కోసం కేటాయించడం అభినందనీయం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*