ట్రంప్ గ్రీన్ కార్డు విధానం పై భిన్నాభిప్రాయాలుWant create site? Find Free WordPress Themes and plugins.
      అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వలస విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో హెచ్-1బి వీసాల గురించి ఎలాంటి ప్రతిపాదన లేదు. ప్రతిభ ఆధారిత వలస విధానం అమలు చేస్తున్నామని చెబుతున్నా..ఎందుకో నమ్మకం కలగడం లేదు. అమెరికాలో ఉంటున్న విదేశీయుల జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాస హోదా కల్పిస్తారు. వారి అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు, తల్లిదండ్రులను అనుమతించక పోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రీన్ కార్డు ఇవ్వడానికి అర్హతలను ప్రస్తావించారు. సమానత్వం, ఆర్థిక విజయం సాధించేందుకు విద్య, ఉద్యోగ అర్హత, ఆంగ్లం స్పష్టంగా మాట్లాడే నేర్పు అంశాల ఆధారంగా గ్రీన్‌కార్డులు ఇవ్వనుంది. ప్రతిభ ఆధారిత వ్యవస్థ ఇదని శ్వేత సౌధం చెబుతోంది. ఏడాదికి ఒక దేశానికి 20,000 గ్రీన్‌కార్డులు మాత్రమే పరిమితం చేస్తే భారత్‌కు ఉపయోగమేనని కొందరు చెబుతుండగా…ఇబ్బందేననంటున్నారు మరికొందరు. 
      అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన రైజ్‌ చట్టం వలస ప్రజలకు వ్యతిరేకమని డెమోక్రటిక్‌ సభ్యులు మండిపడుతున్నారు. వలసదారులు ఎప్పటికప్పుడు దేశానికి కొత్త శక్తిని అందిస్తున్నారనేది వారి వాదన. అమెరికాకు వచ్చే ప్రతి కొత్త తరం ఈ దేశాన్ని మరింత ఉన్నతంగా మారుస్తుందని డెమోక్రటిక్‌ నేత నాన్సీ పెలోసీ లాంటి వారు చెప్పే మాట. తొలి నుంచి ట్రంప్‌ వలస వ్యతిరేక అజెండాను అమలు చేస్తున్నారని.. వలస ప్రజల్లో భయాన్ని నింపడం వల్ల దేశం బలహీన పడుతుందని చెబుతున్నారు. రైజ్‌ బిల్లు వల్ల భారతీయులకు లాభమేనంటున్నారు చాలా మంది. ఇప్పుడు 3 నుంచి 3.5 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉన్నారు. 2016లో మొత్తం 1,26,692 మంది భారతీయులు హెచ్‌-1బీ పొందడమో, పొడిగించుకోవడమో చేశారని అమెరికా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమెరికా జారీ చేసిన హెచ్‌-1బీ వీసాల్లో భారతీయులకే ఏకంగా 72 శాతం దక్కాయి. వీరిలో అత్యధికులు అమెరికాలో స్థిరపడాలనే కోరుకుంటారు. గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేస్తే రైజ్‌ విధానంలో భారతీయులకు పాయింట్లు అధికంగా వచ్చే వీలుందని ఫలితంగా వారికి లాభం ఉంటుందంటున్నారు. 
      భారతీయుల్లో ఎక్కువ మంది అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్‌ (పీజీ) పూర్తిచేసిన వారే ఉంటున్నారు. విద్యార్హతల పరంగా వీరికి 8 పాయింట్లు లభిస్తాయి. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే నాటికి వారి వయసు 25 ఉంటుంది. 26 నుంచి 30 ఏళ్ల కేటగిరీలో ఉంటారు కాబట్టి.. 10 పాయింట్లు లభిస్తాయి. ఆదాయం పరంగా, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంలో కూడా భారతీయులకు మంచి మార్కులే పడతాయి. కాబట్టి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి 30 పాయింట్ల అర్హతను భారతీయుల్లో ఎక్కువ మంది సులభంగా సాధిస్తారు. గ్రీన్‌కార్డుల్లో ప్రతి దేశానికి ఒక ఏడాదికి 20 వేలకు మించకూడదనే నిబంధన వల్ల భారత్ కు నష్టమేమి లేదంటున్నారు. 
          హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం జరుగుతోందని ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్నికయ్యాక చాలా సార్లు చెప్పారు. ఈ వీసాలకు కనిష్ట వేతనాన్ని 1,30,000 డాలర్లకు పెంచుతూ బిల్లును పెట్టారు. భవిష్యత్‌లో హెచ్‌-1బీ వీసాలను ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తే.. ఉన్నత విద్యార్హతలు, ఆంగ్లంపై పట్టు, మంచి వేతనాలు ఉంటాయి కాబట్టి భారతీయ టెక్కీలకు నష్టం ఉండదు. ప్రస్తుతం అమెరికా ఏటా ఇచ్చే 65,000 హెచ్‌-1బీ వీసాల కోసం కంపెనీలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నాయి. బడా కంపెనీలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసి ఇతరుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్‌ వాదన. అందువల్ల హెచ్‌-1బీ వీసాల మంజూరులోనే కాదు..గ్రీన్ కార్డుల జారీలోను మార్పులు జరిగే అవకాశముంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*