’జై లవకుశ‘ సినిమా సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3.25/5
నటీనటులు : ఎన్టీఆర్‌, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, సాయికుమార్‌, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు 
దర్శకత్వం : కె.ఎస్‌. ర‌వీంద్ర‌(బాబి) 
నిర్మాత : క‌ల్యాణ్‌రామ్‌, హ‌రికృష్ణ‌
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం : చోటా కె.నాయుడు 
ఎడిటింగ్‌ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు 
పరిచయ మాటలు….
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ అంతా వన్ మ్యాన్ షో చేశారనే ప్రచారం ముందుగానే వచ్చింది. అందుకే అంతా ఆశగా ఎదురు చూశారు. దర్శకుడు బాబీ ఒక డిజాస్టర్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసినా ఎన్టీఆర్ ఇమేజ్ పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అభిమానులు పండుగ చేసుకునేందుకు సిద్దమైన నేపధ్యంలో జై లవకుశలు ఏం చేశారో చూద్దాం..
కథలోకి వెళితే…
జై, లవ, కుశలు కవల సోదరులు. దిబ్బల్ రావు(పోసాని) మేనళ్ళులు. వారంతా చిన్న తనంలోనే ఊరూరా తిరిగి నాటకాలు వేస్తుంటారు. జైకు నత్తి. మాటలు సరిగా పలకలేడు. ఫలితంగా వేషాలు ఇవ్వకుండా అవమానపరుస్తూ ఉంటారు మిగతా వాళ్లు. దాంతో జై మనసులో కోపం, కసి పెంచుకుంటాడు. ఒక దశలో అగ్ని ప్రమాదానికి కారణమై తమ్ముళ్ళకు దూరమవుతాడు. ఎవరికి వారే మిగతా వారు చనిపోయారనుకుంటారు. వేరువేరుగా బతుకుతుంటారు. భైరంపూర్ అనే ఊరిలో రావణ్ పేరుతో జై మాఫియా డాన్ గా ఎదుగుతాడు. కాక(సాయి కుమార్)అండగా రాజకీయాల్లోకి రావాలని ఎత్తులు వేస్తుంటాడు. లవ కుమార్‌ పెరిగి పెద్దవాడై బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తుంటాడు. కుశ ఏదోలా మాయ చేసి, అమెరికా వెళ్లి, గ్రీన్‌ కార్డ్‌ సంపాదించి అక్కడే సెటిలవ్వాలని కలగంటాడు. దొంగతనం చేసిన డబ్బుతో అమెరికా వెళ్లేందుకు కుశ ప్లాన్ చేస్తాడు. కానీ అప్పుడే పెద్ద నోట్లు రద్దు కావడంతో ఆ కోపంలో చేసిన ప్రమాదంలో అనుకోకుండా లవను కలుస్తాడు. అప్పటికే లవ సమస్యల్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత లవ ప్లేస్ లో తాను బ్యాంకుకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాడు. అనుకోకుండా లవ, కుశలను జై కిడ్నాప్ చేయడం కథకు కీలక మలుపు. ఎందుకు కిడ్నాప్ చేశామో కారణం చెబుతాడు జై. ప్రజల్లో తనకున్న చెడు పేరు పోయేలా లవ చేయాలనీ, తాను ఇష్టపడిన సిమ్రాన్(నివేదా థామస్)ను తనకు దగ్గరయ్యేలా కుశ చేయాలనీ నిబంధన పెడతాడు. 
                 జై కు ఆ ఊరిలో నలుగురు శత్రువులు ఉంటారు. వాళ్ళ వల్ల లవ, కుశలు ప్రమాదంలో పడటంతో జై వాళ్ళను ఎలా కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఎలా వారిని కాపాడతాడు. ఏంటనేది సినిమా క్లైమాక్స్
నటన తీరు…                                                                
జూనియర్ ఎన్టీఆర్ నటన అదుర్స్. అంతా వన్ మ్యాన్ షోలా ఉంది. ఎన్టీఆర్ నటనలో ఇరగదీశాడు. చాలా అద్భుతంగా ఉంది. మంచి కథను ఎంచుకుని వైవిధ్యంగా నటన చూపి ఆకట్టుకున్నాడు. ఛాలెంజింగ్ రోల్స్ మళ్ళీ మళ్ళీ చేసేవి కావు అనేది నిజం. జై, లవ, కుశ మూడు పాత్రల్లో చాలా వేరేయేషన్స్ చూపిస్తాడు ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ జీవితాంతం గుర్తుండి పోయేలా ఉంటోంది ఈ మూవీ. జనతా గ్యారేజ్, టెంపర్ ను మించి పోయేలా నటన ఉంది. జై పాత్ర ఎన్టీఆరే చేయగలడనేలా ఉంది నటన.. మిగిలిన రెండు పాత్రలు బాగానే ఉన్నా ‘జై’ అంతగా ఆకట్టుకోవు. అందుకే అంతా జైనే జై కొడతారు. ఆ కళ్ళతో క్రూరత్వం చూపుతూ, నత్తితో ఇబ్బంది పడే పాత్రలో ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. బయటికి వచ్చాక కూడా లవ, కుశల కంటే జైనే  కలవరిస్తాం. ఇక రాశీ ఖన్నా గ్లామరస్ గా కనిపించింది. నివేదా థామస్ పాత్ర బాగానే చేసింది. ముగ్గురు హీరోలు ఉండటంతో వారిని ఎక్కువగా చూపించలేక పోయారు. జైతో ఉండే కాక పాత్రలో సాయి కుమార్ ఇరగదీశాడు. ఇక ప్రదీప్ రావత్, అభిమన్యు సింగ్ లు పర్వాలేదు. జై నటన ముందు వారు తేలిపోయారు. కామెడీ కోసం ఎవరినీ ప్రత్యేకంగా పెట్టక పోవడం మంచిదైంది. బ్రహ్మాజీ రెండు సీన్లకే పరిమితం. హంసా నందిని పాత్ర ఇలా మెరిసి అలా వెళ్లిపోతోంది. 
సాంకేతిక వర్గం
సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ నుంచి బాబీ బయట పడ్డాడు. బాబీ కష్టం సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ట్రిపుల్ రోల్ ను బాగా తీయడం కత్తి మీద సాము అనే చెప్పాలి. మూడు పాత్రలను బాగానే తీశాడు. జై పాత్రను హైలైట్ చేసి, మిగతా పాత్రలను కాస్త తగ్గించి రాసుకోవడం బాగుంది. కథగా చూస్తే గతంలో మనం విన్నట్లు ఉంటోంది. బాబీ జై పాత్రను రాసుకున్న తీరు, ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు తీసింది ఇతనేనా అనే అనుమానం వస్తోంది. లవ, కుశ పాత్రలను ఇంకా పెంచితే బాగుండేది అనిపిస్తోంది. 
                       ఎన్టీఆర్ ఒక్కడే తన శాయశక్తులా సినిమాను కాపాడేందుకు ప్రయత్నించాడు. జై పాత్రే ముఖ్యంగా కథ రాసుకున్నాడు దర్శకుడు. అందుకే మిగతా వారి పాత్ర అతనికి దిగదుడుపే. ముగ్గురి కలిసి ఉండే కాంబినేషన్ సీన్స్ అంతగా కనిపించవు. ముగ్గురు జై పాత్రలోకి వెళ్లడం కాస్త ఆకట్టుకునే అంశమే. బాబీ నుంచి కోరుకున్న అవుట్ పుట్ వంద శాతం రాలేదని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగానే ఉంది. రావణ బ్యాక్ గ్రౌండ్ థీం ఇంకా ఆకట్టుకుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో సంగీతం అదిరింది. చోటా కె నాయుడు సీనియారిటీ సినిమాలో బాగా కనపడుతోంది. ముగ్గురు ఉండే సీన్లు తక్కువగా ఉన్నా అవి చాలా ఎఫెక్టివ్ గా కనిపించాయి. కోటగిరి ఎడిటింగ్ ఇంకా బాగుండాలి. కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలు అద్భుతం. మరీ ఖర్చు పెట్టకుండా అలాయని ఎక్కడా రిచ్ నెస్ తగ్గకుండా చూశాడు. 
ప్లస్ పాయింట్స్..
+ ఎన్టీఆర్ నటన 
+ కెమెరా పనితనం
+ ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
– స్క్రీన్ ప్లే
– నామ మాత్రమైన హీరోయిన్స్ 
– ఎమోషన్స్ బలంగా లేకపోవడం
– సెకండాఫ్ స్పీడ్ లేకపోవడం
– క్లైమాక్స్
మొత్తంగా… ఎన్టీఆర్ మాత్రమే చేయగలిగిన సినిమా… అభిమానులకు పండుగే.
Did you find apk for android? You can find new Free Android Games and apps.2 Comments

Leave a Reply

Your email address will not be published.


*