యుద్ధం శరణం మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.5/5
నటీనటులు : నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావు రమేష్, రేవతి, ప్రియదర్శి, రవి వర్మ, మురళి శర్మ తదితరులు
దర్శకుడు : కృష్ణ. ఆర్వీ. మరిముత్తు
నిర్మాతలు : రజనీ కొర్రపాటి
సంగీతం : వివేక్ సాగర్
కథ : డేవిడ్ ఆర్.నాథన్ 
స్క్రీన్ ప్లే : డేవిడ్ ఆర్.నాథన్ – అబ్బూరి రవి 
సినిమాటోగ్రఫి : నికేత్ బొమ్మిరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : కార్తికేయ 
సమర్పణ : సాయి శివాణి 
ఎడిటర్ : కృపాకరణ్
డైలాగ్స్ : అబ్బూరి రవి 
సంస్థ‌ :  వారాహి చ‌ల‌న చిత్రం 
పరిచయ మాటలు…
     
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ బాగానే ఆడాయి. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చింది ‘యుద్ధం శరణం’. ఈ సినిమా కృష్ణ మరిముత్తు దర్శకత్వం వహించగా… చైతూకు జోడిగా అందాల భామ లావణ్య త్రిపాఠి నటించింది. చైతూను మనువాడబోతున్న సమంత ఈ సినిమాను బాగా ప్రమోట్ చేసింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. శ్రీకాంత్ ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించడంతో తెలుగులో జగపతిబాబు తర్వాత అలాంటి నటుడు దొరికాడని చెప్పవచ్చు. పాటలు, ట్రైలర్లకు బాగానే ఆకట్టుకున్నాయి. మరోవైపు తండ్రి అక్కినేని నాగార్జున ఈ సినిమా విషయంలో చైతూకు బాగానే సలహాలిచ్చారట. అఖిల్ సినిమా ప్లాప్ తర్వాత తన కొడుకుల సినిమాల విషయంలో నాగ్ జాగ్రత్తలు తీసుకోవడంతో అంచనాలు భారీగానే పెరిగాయి. ప్రేమ, ఎమోషన్ రెండు ఉన్న ఈ చిత్రం వాస్తవంగా ఎలా ఉంది ఏంటనే విషయం తెలుసుకుందాం…
కథలోకి వెళితే…
అర్జున్ (నాగ చైతన్య) మంచి కుర్రాడు. పద్దతిగా చదువుకుని ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ అక్కడ పని చేయడం ఇష్టం లేక డ్రోన్ తయారీపై దృష్టి సారిస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులు ( రావు రమేష్, రేవతి). వారు ఒక స్వచ్చంధ సంస్థ స్థాపించి పేదలకు వైద్యం అందించే పని చేస్తుంటారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావ, స్నేహితులు ఇదే అతని ప్రపంచం. ఇలాంటి సమయంలో అక్కడ సేవలందించేందుకు వస్తోంది అందమైన అమ్మాయి. అర్జున్ జీవితంలోకి అంజలి (లావణ్య త్రిపాఠి) ఎంట్రీ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతోంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అది పెళ్లి చేసుకునే వరకు వస్తోంది. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు అర్జున్. ఈ లోపే ఊహించని సంఘటన జరుగుతోంది. తల్లిదండ్రులిద్దరు కనపడకుండా వెళతారు…
              డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకైనా తెగించే స్థానిక ఉగ్రవాది నాయక్ (శ్రీకాంత్). తల్లితండ్రుల 30వ యానివర్సరీ సందర్భంగా మంచి బహుమతి ఇద్దామనుకుంటాడు అర్జున్. కానీ అదే రోజు నగరంలో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయి. అర్జున్ తల్లిదండ్రులు ఆ సంఘటనలో లోయలో పడి చనిపోయినట్లుగా తెలుస్తోంది. తమ తల్లిదండ్రులు చనిపోవడానికి బాంబు పేలుళ్లు కారణం కాదని.. మరో కారణం ఉందని భావిస్తారు. ఇంతకీ అర్జున్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు… అర్జున్ ఫ్యామిలీకి నాయక్ కి ఏంటి సంబంధం? నాయక్ ను అర్జున్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
నటన ఎలా ఉందంటే…
‘యుద్ధం శరణం’ అనే సినిమా నాగచైతన్యలోని కొత్త కోణాన్ని చూపించింది. ఆయుధాలు, బాంబులు లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో తనకు ఎదురైన సమస్యకు సమాధానమిస్తాడు. చైతన్య నటుడిగా మంచి మార్కులే వేయవచ్చు. నటుడిగా తన పాత్రకు బాగా న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైనింగ్, లవ్, రొమాంటిక్ అంశాలతో చాలా బాగా సాగింది. కుటుంబం, ప్రేమ, రొమాన్స్, హీరోయిన్లతో ఆట పాటలు సాఫీగా సాగిపోతోంది. చైతూ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ అంశాలు ఉన్నా.. బాగానే చేశాడు. ప్రతినాయకుడి పాత్రలో నటించిన శ్రీకాంత్ ఆకట్టుకున్నాడు. నెగెటివ్ పాత్రలో శ్రీకాంత్ ఒదిగిపోయాడు. అందుకే ఇక ముందు చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రల్లో శ్రీకాంత్ ను తీసుకునే అవకాశముంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠీ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఫస్టాప్ లో బాగానే కనిపించిన హీరోయిన్.. సెకండాప్ లో రెండు మూడు సార్లే కనిపించింది. చైతూ-లావణ్యల మధ్య వచ్చే సీన్లు చాలా బాగుంటాయి. చైతూ తల్లిదండ్రులుగా నటించిన రావు రమేష్, రేవతిల నటన బాగుంది. ప్రియదర్శి నటన బాగానే ఉంది. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే చేశారు.
కథ నడిపించిన తీరు..
కృష్ణ.ఆర్వీ.మరిముత్తు దర్శకత్వ ప్రతిభ పర్వాలేదు. కానీ కొన్ని సీన్లు వస్తుంటే ఏం జరుగుతాయో ముందే ఊహించవచ్చు. ఫ్యామిలీ రివేంజ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది సినిమా. సంతోషంగా సాగిపోతున్న ఓ కుర్రోడి ఫ్యామిలీ అలజడి. జీవితంలోకి అనుకోని ఓ పెద్ద సమస్య వస్తే.. ఆ సమస్య పై పోరాడటానికి అతను ఏం చేసాడనేది మొత్తం కథ. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా ప్రారంభం నుంచే ఓ ఎమోషనల్ మూడ్‌ను తీసుకువస్తోంది. అర్జున్ తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటూ వుంటాడు. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ కాస్త, లవ్, ఫ్యామిలీ అంశాలు ఉన్నా.. ఇంకా సినిమాలో ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎమోషన్ అంశాలను ముత్తు నడిపించిన తీరు బాగున్నా.. కథ మరింతగా రాసుకుంటే బాగుండేది.
సాంకేతికాంశాలు…
ఈ సినిమాకు నికేత్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. వివేక్ సాగర్ సంగీతం పాటలు పర్వాలేదు. కానీ అనుకున్న పదాలు విజువల్స్ పరంగా చూడలేం. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనుకున్నంత మేర లేదు. పాటలు బయటకు వచ్చాక పాడే పరిస్థితి లేదు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ అదుర్స్. ఎడిటింగ్ సరిగా లేదు. కథలో కొత్త దనం కనపడదు. ఇంతకు ముందు చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లే ఉన్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో కొత్తదనం లేదు. దర్శకుడు కృష్ణ తను అనుకున్న కథను జనాలను అలరించే విధంగా చూపించడంలో వెనుకంజ వేశాడని చెప్పాలి. సినిమాలో పెద్దగా ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు. ఫస్ట్ హాఫ్ నుంచే సాగదీత ఉంటోంది. మొత్తంగా ఈ సినిమా సక్సెస్ అనుకున్నంత మేర ఉండక పోవచ్చు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు.
ప్లస్ పాయింట్లు
+ నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, రేవతిల నటన
+ మంచి విజువల్స్
+ నిర్మాణ విలువలు
+ వినోదం 
మైనస్ పాయింట్లు
– కథ, కథనం
– బోరింగ్
– సన్నివేశాల్లో వేగం తగ్గడం
– దర్శకత్వ ప్రతిభ వెలుగులోకి రాకపోవడం
 
చివరిగా… యుద్ధం శరణం పర్వాలేదు. ఒకసారి చూడొచ్చు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*