హూస్టన్‌లో సాయం చేస్తున్న తెలుగువారు Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగువారికి సాయం చేసే గుణం ఎక్కువ. సాటి వారు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేని నైజం. అదే తెలుగు జాతి ఖ్యాతిని అన్ని చోట్ల నిలబెడుతోంది. మిగతా ప్రాంతాలకు విస్తరింపజేసింది. ఇప్పుడు హూస్టన్ లోనూ అదే జరుగుతోంది. తుఫాన్, భారీ వరదలతో హూస్టన్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. జనజీవనం స్థంభించి పోయింది. ఇలాంటి సమయంలో తెలుగు వారికి ఏవరైనా సాయం చేయాలి. కానీ తెలుగువారే మిగతా వారికి సాయపడుతున్నారు. ముఖ్యంగా భారతీయులకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వారికి తాత్కాలిక నివాస వసతినే కాదు.. ఆహారం అందిస్తున్నారు. తాము తోడుగా ఉంటామని చెబుతున్నారు. అదే అందరిలోను ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా వెళ్లి అక్కడ కూడ తెలుగోడి ఘనతను చాటుతున్న వారు ప్రసంశనీయులు. 
                              హూస్టన్ లో రెండు లక్షల మంది వరకు ప్రవాస భారతీయులున్నారని అంచనా. హర్వే తుఫాన్ దెబ్బతో వారి ఇళ్లు మునిగాయి. తినడానికి ఏం లేదు. బయటకు వెళ్లాలంటేనే ఇబ్బంది. కార్లు బయటకు తీసే పరిస్థితి లేదు. తాగడానికి, తినడానికే కాదు.. కనీసం ఉండేందుకు అనువైన పరిస్థితి లేదు. వరదనీరు ఇళ్లల్లోకి పోటెత్తడమే ఇందుకు కారణం. పాములు, తేళ్లు, మొసళ్లు ఇళ్లలోకి చేరాయి. మొన్నటి వరకు ఆనందంగా ఉన్న ఇంటిలో ఇప్పుడు కాసేపు ఉండాలంటేనే భయపడే పరిస్థితి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ఇళ్లు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వారు పిల్లలకు పాలు లేక అల్లాడుతున్నారు. చలికి గజగజ వణుకుతున్నారు. తినడానికి తిండి సరే… ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేవు. ఇలాంటి సమయంలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లు స్పందించిన తీరు అద్భుతం. వరదల్లో చిక్కుకున్న తమ వారిని ఆదుకునేందుకు చేయి చేయి కలిపారు. సోషల్ మీడియా వేదికగా వారి జాడ కోసం ప్రత్యేక పోస్టింగ్ లు చేస్తున్నారు. దేవాలయాల్లో ఆశ్రయమిస్తున్నారు. అన్నపానీయాలను సమకూరుస్తున్నారు. గురుద్వారాలు, మసీదులు, హైస్కూళ్లు, కాలేజీలలో శిబిరాలు ఏర్పాటయ్యాయి. నిరాశ్రయులందరినీ యుద్ధప్రాతిపదికన వాటిలోకి చేర్చారు. ఆలయాలు మొత్తం కిక్కిరిసిపోతున్నాయంటే అక్కడి మనవారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
                          చిరంజీవి ఠాకూర్ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు బాధితులు. ఒకరు మరొకరికి సాయ పడండి. వారు ఇంకొకరికి సాయం చేయండనే పద్దతిలో వెళుతున్నారు. సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబ సభ్యులు… మరో రెండు మూడు కుటుంబాలకు ఆశ్రయమిచ్చారు. అంతే వారు మిగతా వారికి. అలా చైన్ లాగా కదిలిపోతోంది. సాయం చేసే గుణం ఉంటే చాలు.. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా పెద్దఎత్తున వాలంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ఏయే కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. ఏయే కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆస్తి నష్టం ఎంత మేర ఉంది వంటి వివరాలను పంచుకుంటున్నారు. 
                           మీకు ఎవరికైనా ఇబ్బంది వంటే మా వద్దకు రావచ్చంటూ పోస్టింగ్స్ పెడుతున్నారు. ఆపదలో ఉన్నవాళ్లు తమ ఇంటికి రావచ్చని ఆహ్వానించడం మాములు విషయం కాదు. రెండు మూడు కుటుంబాలకు తాము ఆశ్రయం ఇస్తామని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ తమ ఉదారత చాటుకోవడం అభినందనీయం. మరోవైపు 10-15 ప్రవాస భారతీయుల హోటళ్లు వేలాది మందికి ఉచితంగానే ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. ఆపదలో చిక్కుకున్న వారితోపాటు శిబిరాల్లో తలదాచుకున్న వారికి అందిస్తున్నాయి. ఒక్కో హోటల్‌ దాదాపు 2000 మందికి ఆహారాన్ని అందించడం మాములు విషయం కాదు. ఇందుకు లక్షల్లో ఖర్చు అవుతోంది. అయినా వెరవలేదు.ఇలాంటి సమయాల్లో కాకపోతే ఇంకెపప్పుడు ఆదుకుంటామని ఆలోచించారు. అంతే వారు ముందుకు కదిలారు. డబ్బున్న వారు కొంత మంది ఆ హోటల్స్ కు ధన సాయం చేస్తుండటం విశేషం. హూస్టన్లోని పైన్‌విల్లే ప్రాంతం పై తుపాను ప్రభావం అంతగా లేదు.
కిశోర్ సేవా దృక్పథం…
అక్కడున్న కిశోర్‌ రామ రాజు వందమంది వాలంటీర్లతో సహాయ పునరావాస కార్యక్రమాలు చేస్తున్నారు. 5000 మంది సభ్యులున్న హూస్టన్‌ దేశీ ఫ్రెండ్స్‌ ఫేస్‌ బుక్‌ పేజీ ద్వారా సమాచారం పంచుతోంది. వాటి ద్వారా పడవలు, వరద నీటిలోనూ వెళ్లి రాగల తమ భారీ వాహనాలను పంపుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారు ఏం చేయాలి? ఎలా బయటపడాలి? సురక్షిత మార్గాలు ఏవి? తదితర వివరాలన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. ఎక్కడున్నా మన ప్రాంతంపై ఉండే అభిమానం ఇప్పుడు ఒకరికొకరు తోడుగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పలువురు ప్రవాస భారతీయులు ఆనందాన్ని పంచుకుంటున్నారు. భారతీయులతీరు అమెరికా వారిలోను స్పూర్తిని నింపుతోంది. వారు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా పావులు కదుపుతుండటం విశేషం. పోతూ కట్టుకుపోయేది ఏముంది. ఉన్న నాలుగు రోజు హాయిగా బతకడం, తమకు చేతనైనంతలో ఇతరులకు సాయ పడటమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు తెలుగువాళ్లు. అందుకే ప్రవాస తెలుగువారిని మిగతా వారు ఆదర్శంగా తీసుకోవాలని నమస్తే ఆంధ్రా కోరుకుంటోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*