గెలుపు ఎత్తులోతో రసవత్తర రాజకీయంWant create site? Find Free WordPress Themes and plugins.
ఒకవైపు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం. మరోవైపు మాటల తూటాలు. విమర్శలు, ప్రతివిమర్శలు. ఆరోపణలు, ప్రత్యారోపణలు. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మొత్తంగా తెలుగునాట ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. వాడి వేడిని రగిలిస్తోంది. టీడీపీకి ఓటేయవద్దని.. కామ్రేడ్స్ చెబితే… సైకిల్ ను గెలిపించాలని కమలం పార్టీ అంటోంది. అధికార పార్టీలను అసలు నమ్మవద్దని ఇటు ముద్రగడ, అటు కోదండరామ్ లు ఎత్తులు వేయడం ఆసక్తికరమే. పవన్ కల్యాణ్ ఇంకా తన నోటి మాట చెప్పక పోగా.. బాలయ్య రంగంలోకి దిగనుండటం ఉత్కంఠను పెంచుతోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో నెలకున్న తాజా రాజకీయాంశాలను ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం…
        నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ లకు చావు రేవులా మారాయి. అందుకే తమ శక్తినంతా దాని మీదనే కేంద్రీకరించాయి. సి.ఎం చంద్రబాబునాయుడు రెండు సార్లు నంద్యాలకు వెళ్లి రాగా..ఆయన కుమారుడు నారా లోకేష్ మరోసారి అక్కడి క్యాడర్ లో ఉత్సాహం నింపి వచ్చాడు. టీడీపీ అట్టు పెడితే మేము అట్టున్నర పెడతామంటూ విపక్ష పార్టీ అధినేత జగన్..అసలు అక్కడే మకాం వేశాడు. టీడీపీ పక్షాన రాజకీయాలకు కొత్త అయిన భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శిల్పా మోహన్ రెడ్డిలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో మిగతా పార్టీల మద్దతు ఎటువైపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 
సైకిల్ కు దూరంగా కామ్రేడ్స్ 
నంద్యాల ఉప ఎన్నికల్లో కామ్రేడ్స్ ఎవరికి మద్దతు ఇస్తారనే అంశం పై నెలకున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార టీడీపీ, బీజేపీ కూటమిని ఓడించాలనేది వారి పిలుపు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయి. అందుకే ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ఓడించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీర్మానించాయి. టీడీపీని కాదన్నాయి. కానీ ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది తేల్చి చెప్పలేదు. రాజుగారి పెద్ద భార్యకు మద్దతు ఇచ్చేది లేదని గట్టిగానే చెప్పారు. కానీ చిన్న భార్య సంగతి ప్రస్తావించలేదు అన్నట్లుగా ఉంది కమ్యూనిస్టుల వ్యవహారం. నంద్యాలలో ప్రధాన పోటీ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ల మధ్యనే ఉంది. దీంతో టీడీపీని కాదంటే పరోక్షంగా వైసీపీకే వారి మద్దతు అని తెలుస్తోంది. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జగన్ పార్టీకి వారు బాహాటంగా మద్దతు పలకలేదు. ఈ మేరకు సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం ఏపీ కార్యదర్శి మధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి సాగిన ఆ రెండు పార్టీలకు ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. ఉద్యమ పార్టీలుగా ప్రజల్లో మంచి పలుకుబడే ఉంది. ఓట్ల రూపంలో దాన్ని మలుచుకోవడం ఆ రెండు పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి.  
                     ఏపీ సర్కారు పాలనలో అవినీతి జరుగుతుందని ఆ రెండు పార్టీలో మొదటి నుంచి పోరాటం చేస్తున్నాయి. ఇసుక అక్రమాలతో పాటు..లంచగొండితనం పెరిగిందని…పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు వాళ్లు. నంద్యాల ఎన్నికల్లో కమ్యూనిస్టు నేతలెవరు పోటీకి దిగలేదు. నంద్యాలలో పోటీ చేసినా గెలిచే సత్తా లేదనే ఆలోచనతో వారు వెనక్కు తగ్గారనేది వాస్తవం.  అంతే కాదు..కోట్ల రూపాయలు పెట్టి పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీలకు లేదనేది నిజం. 
టీడీపీకే కమలం మద్దతు
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికారిక తెలుగుదేశం పార్టీకే మద్దతు పలికింది ఏపీ బీజేపీ. ఈ మేరకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆ పార్టీ  నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించింది. నంద్యాల ఉప ఎన్నికతోపాటు త్వరలో జరగనున్న కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీతో కలిసే పనిచేయాలని వారు తీర్మానించారు. టీడీపీ- బీజేపీలు రాష్ట్రంలోనే కాదు కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు విషయంలో మాత్రం బీజేపీ తన నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. కమ్యూనిస్టులు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునివ్వడంతో బీజేపీ ఆ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకుంది. నంద్యాలలో బీజేపీ శ్రేణులు టీడీపీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. నంద్యాలలో 60 వేల మైనార్టీ ఓట్లున్నాయి. వారు ఎటు మొగ్గు చూపితే వారిదే విజయం. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఫలితంగా ఇలానే వచ్చింది. సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు                            నంద్యాలలోని మైనార్టీ ఓటర్లు. నంద్యాలలో బీజేపీ ప్రచారం చేస్తే తమకు లాభం కంటే నష్టం ఉంటుందని తెలుగు తమ్ముళ్ల అంచనా. సి.ఎం చంద్రబాబునాయుడు బీజేపీ విషయంలో ఇప్పటికీ ఒక్క మాట మాట్లాడలేదు. ప్రచారానికి రావాలని కానీ వద్దనిగానీ సమావేశాల్లో సభల్లోను ప్రస్తావించలేదు. ఆ పార్టీ పై ఎలాంటి ఒత్తిడి చేయలేదు టీడీపీ. ఇప్పుడు వారంతట వారే టీడీపీకి మద్దతు తెలపడంతో పాటు..ప్రచారం పాల్గొనాలని నిర్ణయించడం మంచిదే. కానీ ఇబ్బంది వస్తుందేమోనని టీడీపీ స్థానిక శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. 
అమిత్ షా రాకతో ఉత్కంఠ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడురోజుల పాటు పాటు ఏపీలో పర్యటించనుండటం ఆసక్తి పెంచుతోంది. నంద్యాల ఉప ఎన్నికలు  ముగిసిన తర్వాత ఆయన రానుండటం ఒక ఎత్తయితే ఏకంగా మూడు రోజుల పాటు ఏపీలోను గడపనుండటం మరో ఎత్తు. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లడంతో దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు చూసే నేత ఎవరూ లేరు. అందుకే ఆ స్థానంలో మరో కీలక నేతను ఎంపిక చేయనున్నారు అమిత్ షా. పనిలో పనిగా ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని నియమించేందుకు అమిత్ షా పావులు కదుపుతున్నాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నంద్యాలలో ఆగస్టు 23న పోలింగ్‌ జరగనుండగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. ఆగస్టు చివరి వారంలో ఏపీలో అడుగు పెట్టనుండటం ఆసక్తిని పెంచుతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీతో అంత తేలికగా పొత్తు వదులుకునేందుకు సిద్దంగా లేదన వాదన లేకపోలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికి ప్రచారంలో పాల్గొననుంది బీజేపీ.  
                 ఏపీ బీజేపీ శాఖకు కొత్త నేతను ఎంపిక చేయడంతో పాటు..రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే అంశం పైనా కసరత్తు చేయనున్నారు అమిత్ షా. అందుకే ఈ పర్యటన ఏపీ బీజేపీకి చాలా కీలకం కానుంది. పురందేశ్వరి, గోకరాజు గంగరాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారి పేర్లను అధ్యక్ష స్థానం కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నెలలోనే పూర్తి విషయాలు తెలియనున్నాయని చెబుతున్నారు ఆపార్టీ నేతలు.  
వీళ్లు… మారరా….
మిర్చి సినిమాలో హీరో ప్రభాస్ పాత్ర ఒక డైలాగ్ చెప్పిస్తాడు దర్శకుడు కొరటాల శివ. నువ్వు మారవా..నువ్వు మారవురా…ఆ ఊరి మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కనుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చెయ్యి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకుని ఆ మగాడి పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయి ప్రేమగా మారాడు. మీ ముందుకు వచ్చాడు. మీరు మారండని చెబుతాడు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో శృతి మించిన పార్టీ నేతలకు ఈ వ్యాఖ్య బాగా సరిపోతోంది. టీడీపీ నేతలు గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వీలున్నంతగా సంయమనం పాటిస్తున్నారు. పౌరుషం లేక కాదు..మాటలు అనలేక కాదు. ప్రజల ముందు మంచి మనషులుగా ఉండేందుకే గతాన్ని వదిలిపెట్టామని చెబుతున్నారు వాళ్లు. కానీ విపక్ష పార్టీ అధినేత జగన్ లో ఇంకా మార్పు రాలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మాములు మాటలైతే పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే వ్యక్తిగత విమర్శలకు దిగితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఆందోళనలు, నిరసనలు, దిష్టిబొమ్మల దగ్దం వరకు విషయం వెళుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విపక్ష నేత జగన్ అలాంటి విమర్శల దాడినే కొనసాగిస్తుండటం చర్చనీయాంశమైంది. 
            ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. యువతకు నిరుద్యోగ భృతి, పేదలకు ఇళ్లు అంటూ చెప్పి మోసం చేశారన్నారు. అంతే కాదు…చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంటివెలగలలో జరిగిన రోడ్‌ షోలో వైఎస్‌ జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన ప్రధాన నాయకులెవరూ నంద్యాల వైపు తిరిగి చూడలేదని గుర్తు చేశారు. రాకీయ నాయకులు ఎవరైనా మాటిచ్చి తప్పితే ప్రజలు వారిని కాలర్‌ పట్టుకుని అడగాలన్నారు. 
                         మొన్న చంద్రబాబును నడిరోడ్డు పై కాల్చిపారేయాలని వివాద స్పద వ్యాఖ్యలు చేశాడు జగన్. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వివరణ అడగడంతో సమాధానం పంపిన తెల్లారి మరోసారి జగన్ అదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలను మూటగట్టుకున్నాడు. ఎంతగా అంటే…ఇచ్చిన మాటల నిలబెట్టుకోని చంద్రబాబును ఉరితీయాలనిపిస్తుందని చెప్పారు. దీనికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. అయినా వెనక్కు తగ్గలేదు. ఈసారి చంద్రబాబును కాలర్ పట్టుకుని అడగాలని కోరడం మరోసారి కలకలం రేపుతోంది.  
టిజి వెంకటేష్ పై ఆరోపణల పర్వం…
టీడీపీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్. ఇప్పుడు ఆయన ఇంటి పై పడ్డారు వాటర్ మాన్ గా పేరొందిన రాజేంద్రసింగ్. కర్నూలులో ఆయన ఇంటి పరిసరాలను పరిశీలించిన రాజంద్ర సింగ్ టీజీ తీరుపై ఆందోళన వ్యక్తం చేయడం ఆసక్తికరమే. ఎంపీ ఇంట్లో వాడేసి వృధాగా పోయే నీటిని ఏకంగా తుంగభద్ర నదిలోకి పంపుతున్నారనే ఆరోపణలున్నాయి.  తన పరిశీలనలో జలరంగ నిపుణుడు రాజేంద్ర అదే విషయాన్ని కనుక్కొన్నాడు.. ఎంపీ ఇంటి పక్కన నుంచి వస్తున్న మురుగు నీరు తుంగభద్రలో కలుస్తుంది. ఆ తర్వాత ఆ నీరు కర్నూలు జిల్లా నందికొట్కూరు వద్ద కృష్ణానదిలో కలిసిపోతోంది. కృష్ణా నదీ తీరం కాలుష్యమయం అవుతుందని…నదిని డంపింగ్ యార్డుగా మార్చారని రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలులో నదీ తీరం అంతా కాలుష్యమయం అయినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు రామన్ మెగస్సే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి ఇప్పుడు రాజేంద్ర సింగ్ రూపేణా మరో ఆయుధం దొరికింది. టీడీపీ ఎంపీ టిజి వెంకటేష్ తన ఇంటి నుంచి మురుగునీరు ఏకంగా నదిలోకి పెడుతున్నారని..ముందు అలాంటివి ఆపాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. టీడీపీ ఎంపీ చూడు ఏం చేస్తున్నారో అంటూ ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. 
కొరకరాని కొయ్యలు
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, తెలంగాణలో కోదండరామ్ లు ఆయా ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యలుగా మారిన మాట నిజం. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నాడు. నిరసన, నిరశన దీక్షలకు దిగాడు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. అయితే ముద్రగడ ఉద్యమం హింసాత్మకం, విధ్వంసం బాట పట్టడంతో ప్రభుత్వం ఆయన పై పూర్తిగా నిఘా పెట్టింది. అసలు ముద్రగడను ఇంటి నుంచి బయటకు పంపేందుకు సిద్దపడటం లేదు. ఫలితంగా ముద్రగడ నిరవధిక గృహ నిర్భందంలోనే కొనసాగుతున్నాడు.పాదయాత్ర చేయలేక అసహనంతో రగిలిపోతున్నాడు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు తన ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పారాయన. అయితే ఉద్యమంలో రాజకీయాలకు తావు లేకుండా సాధించుకుంటే బాగానే ఉండేది. కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా కాపు నేతలంతా ఓటేయాలని ముద్రగడ పిలుపునివ్వడం విమర్శలు తావిచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమం చేస్తే విజయవంతం అయ్యే వీలుంది. బ్రాహ్మణ కార్పోరేషన్ కు నిధులు తెప్పించుకోవడంలో పెద్దగా ఉద్యమాలతో పని లేకుండానే జరిగింది. ఉద్యమం చేసే వ్యక్తి ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీకి అనుకూలంగా వెళ్లడం వల్ల దాని తీరు పక్కదారి పట్టే వీలుంది. ఇప్పుడు ముద్రగడ విషయంలో అదే జరుగుతోంది. 
                      మరోవైపు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ సి.ఎం కేసీఆర్ వర్గానికి కొరుకుడు పడటంలేదు. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు కోదండరామ్. తెలంగాణ ఏర్పాటులో పొలిటికల్ జేఏసీ పాత్ర తక్కువేం కాదు. కొన్ని సార్లు ఉద్యమాన్ని మధ్యలోనే కేసీఆర్ ఆపేసినా.. కోదండరామ్ కొనసాగించిన ఉదంతాలు ఉన్నాయి. ఉద్యమ నేతగా కోదండరామ్ ను తప్పు పట్టలేం. కానీ తెలంగాణ సర్కారుకు కోదండర్ రామ్ వంటి నేతలు పంటికింద రాయిలా మారారు. కొరకలేం. అలాయని ఉయ్యలేం అన్న చందాన పరిస్థితి తయారైంది.  గతంలోనే కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి దిగినా వెనక్కు తగ్గలేదాయన. మొన్నటి వరకు సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచిన కోదండరామ్ నేడు దళితుల సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై దృష్టిపెట్టాడు. ఇది టీఆర్ఎస్ సర్కారును చికాకు గురి చేస్తోంది. కాంగ్రెస్ కు దన్నుగా నిలిచేలా కోదండరామ్ వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు చేస్తోంది గులాబీ పార్టీ. ఏపీలోనే కాదు..తెలంగాణలోను ఇప్పుడు ఉద్యమాల జోరు ఊపందుకోవడం ఆసక్తికరమే.   
                       ఇక జాతీయ స్థాయి రాజకీయాలను చూస్తే కొత్త పొత్తులకు తెరలేస్తోంది. కాషాయం నేతలకు ఎన్సీపీ దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కమలం పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. హస్తినలో బీజేపేతర పార్టీల సమావేశానికి ఎన్సీపీ నేతలెవరు హాజరు కాకపోవడం ఆ వాదనానికి బలం చేకూర్చేలా ఉంది. మరోవైపు గుజరాత్ లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ కు వ్యతిరేకంగా ఓటేశారు. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేస్తే అహ్మద్ పటేల్ ఆశలు గల్లంతయ్యేవి. ఒకరు అనుకూలంగా, మరొకరు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ను వీడిన ఇద్దరు ఎమ్మెల్యేల తప్పు వల్ల అహ్మద్ పటేల్ చావు తప్పి కన్నులొట్టిబోయినట్లుగా బతికిపోయాడు. లేకపోతే ఓటమిని చవి చూడాల్సి వచ్చేది. 
                       బీజేపీపై సమైక్య పోరుకు సిద్దమయ్యేందుకు విపక్షాలతో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ కీలక భేటీకి ఎన్‌సీపీ నేతలెవరూ హాజరుకాలేదు. ఫలితంగా ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ బీజేపీకి దగ్గరవుతారా అనే చర్చ సాగుతోంది. భావ సారూప్యత ఉన్న 16 విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ అధిన్రేతి సోనియా గాంధీ గట్టిగానే పావులు కదుపుతున్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ బీజేపీ ప్రభుత్వంపై సమిష్టిగా పోరు చేయాలని బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించగా… మిగతా పక్షాలు సమ్మతించాయి. దీంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అటు జాతీయ రాజకీయాల్లోను కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*