తమిళనాట అసలు సిసలు రాజకీయం ..Want create site? Find Free WordPress Themes and plugins.
       తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పాలక పార్టీలోని వైరి వర్గాలు ఏకమవుతున్నాయి. అందుకు హస్తిన నుంచి బీజేపీ రాజకీయం నెరుపుతోంది. మీరు కలిసి పోతారా..మేమే కలుపుకుపోయేమా అనే సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా తమిళనాడులోని పాలక వర్గాలు విలీనం అయ్యే దిశగా కదులుతున్నాయి. ఆగస్టు15 నాటికి రెండు వర్గాలు కలిసిపోనున్నాయి. ఆ తర్వాత వారం రోజులకు తమిళనాడులో అడుగు పెట్టనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. రాబోయే ఎన్నికల్లో తమిళనాట పూర్తి స్థాయిలో అడుగు పెట్టాలనేది బీజేపీ వ్యూహం. అందుకే తమిళనాడులోని సి.ఎం పళని స్వామి, మాజీ సి.ఎం పన్నీర్ సెల్వం వర్గాల మధ్య రాజీ కుదిర్చే పని చేస్తోంది కమలం పార్టీ. 
చరిత్రలోకి తొంగి చూస్తే….
          తమిళనాట విలక్షణ రాజకీయ చరిత్ర ఉంది. కొద్దిగా మూలాల్లోకి వెళితే ఆసక్తికర కోణాలు ఎన్నో. దక్షిణ భారత సంక్షేమ సంఘం నుంచి పుట్టిందే జస్టిస్ పార్టీ. 1931 నుంచి 1952 వరకు తన హవాను కొనసాగించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఏపీ నుంచి జస్టిస్ పార్టీ నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టిన చరిత్ర ఉంది. ద్రవిడనాడు రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఈవీ రామస్వామి ద్రవిడ కజగం ఏర్పాటు చేశారు. అన్నాదురై, పెరియార్ రామస్వామిల మధ్య వివాదం మొదలైంది. ఫలితంగా అన్నాదురై 1956లో వేరు పడి…ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని ఏర్పాటు చేశారు. చివరకు ఆపార్టీ 1967లో అధికారంలోకి వచ్చింది. 1952-67 వరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీనే రాజ్యమేలింది. అప్పుడు అసలు ప్రాంతీయ పార్టీల హవానే లేదు. కానీ అన్నాదురై వచ్చాక..రాజకీయాలు తారుమారయ్యాయి. 1969లో అన్నాదురై మరణంతో ఆ పార్టీ సంక్షోభం ఏర్పడింది.అనూహ్యంగా కరుణానిధి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. అది ఎంజిరామచంద్రన్ కు నచ్చలేదు. ఎంజిఆర్, కరుణానిధిల మధ్య వివాదంతో ఏర్పడ్డ పార్టీనే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం( ఏఐడిఎంకే). డిఎంకే నుంచి చీలిపోయి పార్టీ పెట్టిన ఎంజిఆర్ తన హవాను కొనసాగించాడు. సినీ నేపధ్యం నుంచి వచ్చిన ఎంజీఆర్ పదేళ్ల పాటు..ముఖ్యమంత్రిగా కొనసాగాడు. 1977-87 వరకు ఆయనే తమిళనాడులో సి.ఎంగా పని చేసి కాంగ్రెస్ కు చోటు లేకుండా చేశాడు. అప్పటి నుంచి ఇక తమిళనాడులో ప్రాంతీయ పార్టీలే విజయం సాధిస్తూ వచ్చాయి. ఎంజిఆర్ మరణం తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్ తాత్కాలికంగా సి.ఎం అయ్యారు. అది నచ్చని ఎంజీఆర్ అనుచరురాలు..జయలలిత సి.ఎం పీఠం పై కన్నేశారు. కానీ ఇలాంటి సమయంలో కరుణానిధి తన సత్తా చాటాడు. మరోసారి డిఎంకే ను అధికార పీఠంలోకి తీసుకువచ్చారు. 1991లో జయలలిత తొలిసారిగా అన్నాడిఎంకేను అధికారంలోకి తెచ్చింది. ఫలితంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అటు కరుణానిధి ఐదు సార్లు..జయలలిత మరో ఐదుసార్లు సి.ఎంలుగా ప్రమాణ స్వీకారం చేయడం సాధారణ విషయం కాదు. 1991లో 168 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన జయలలిత పార్టీ 164 సీట్లల్లో గెలవడం రికార్డేనని చెప్పాలి. అదే సమయంలో 2004 పార్లమెంటు ఎన్నికల్లో కరుణానిధి 40 లోక్ సభ సీట్లకు పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలవడం ఆయన సత్తాను చాటింది. ఇలా ఎవరికి వారే పోటీగా ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి రావడం తమిళరాజకీయాలకు కొత్త కాదు.  
అమ్మ లేని లోటు….
.
        ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత ఆరోగ్యం దెబ్బతింది.అంతే వెంటనే చైన్నైలోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే 2016, డిసెంబరు 5న ఆసుపత్రిలోనే జయలలిత కన్నుమూయడంతో తమిళనాడులో మరో శకం ప్రారంభమైంది. డిసెంబరు 6న జయలలిత అంత్యక్రియలు జరిగిన రోజు నుంచి రెండు వర్గాలుగా ఏఐడిఎంకే చీలిపోయింది. అమ్మ నెచ్చెలి శిశకళ సి.ఎం పీఠం ఎక్కేందుకు ప్రయత్నించినా..ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు తీర్పు శరాఘాతంగా మారింది. ఫలితంగా చిన్నమ్మ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జయలలిత చనిపోయాక తాత్కాలిక సిఎంగా పన్నీర్ సెల్వం వ్యవహరించినా..ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎడప్పాడి పళనిస్వామి సిఎంగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు.   
       అన్నాడీఎంకేలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గం, మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) వర్గాలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏఐడిఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ నియామకం చెల్లదని ఈపీఎస్‌ వర్గం ప్రకటించింది. ఫలితంగా ఆ రెండు వర్గాలు కలిసిపోయేందుకు ముందుకు వచ్చాయి. ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఒక్కటి కానున్నారు. ఓపీఎస్ ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఎడప్పాడి వర్గం సుముఖంగా ఉంది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పన్నీరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. హస్తిన చర్చల్లో రాజీ కుదురుతుందని, విలీన ప్రక్రియ ముగిసిపోతుందని ఉభయ వర్గాలు  ఆశాభావంతో ఉన్నాయి.
దినకరన్ కు చెక్
      పళనిస్వామి (అన్నాడీఎంకే-అమ్మ) వర్గ నేతలు ప్రత్యేకంగా సమావేశయ్యారు. ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ నియామకం చెల్లదని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానం పై 27 మంది పార్టీ నిర్వాహకులు సంతకం చేశారు. మరోవైపు దినకరన్ వివిధ పదవుల్లో 64 మందిని నియమించిన సంగతి తెలిసిందే. అవి చెల్లుబాటు కావని దివంగత సి.ఎం జయలలిత నియమించిన కార్యవర్గమే చెల్లుబాటవుతుందని ప్రకటించారు. ఆ కార్యవర్గమే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతోందని తీర్మానం చేయడం విశేషం. ఫలితంగా శశికళను పక్కనబెట్టినట్లే అయింది. ఇది జైలులో ఉన్న శశి వర్గానికి మింగుడు పడని అంశమే. ఈ భేటీ తర్వాత మంత్రులు వైద్యలింగం, డి.జయకుమార్‌ లు మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లోనే విలీనం పూర్తవుతుందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపికైంది. వాస్తవంగా తీహార్‌ జైలుకు వెళ్లిన దినకరన్‌ బెయిలుపై వచ్చాక దూకుడు పెంచారు. జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళతో మాట్లాడి వచ్చాక 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీరాలు పోయాడు. ఆ తర్వాత దూకుడు పెంచడం మిగతా వారిని ఆలోచనలో పడేసింది. శిశకళలో రెండోసారి భేటీ అయి వచ్చాక తనకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామికి హెచ్చరికలు పంపడం ఉత్కంఠను పెంచింది. ఈ నెల 5న పార్టీ ప్రధాన కార్యాలయానికి వస్తానని, అందరూ రావాలని కోరినా ఆ తర్వాత వెనక్కు తగ్గాడు. చేయి దాటి పోతుందని భావించిన ముఖ్యమంత్రి పళనిస్వామి అప్రమత్తమై దినకరన్‌కు చెక్ పెట్టే పనికి దిగారు. మాజీ సి.ఎం పన్నీర్‌సెల్వం వర్గంతో సర్దుకుపోతే ఇబ్బంది ఉండదని ఆలోచించాడు. అంతే పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. 
      ఐదేళ్ల వరకు పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ దినకరన్‌ పాల్గొనకూడదని ఆ రెండు వర్గాలు తీర్మానించాయి. పార్టీ శ్రేణులు దినకరన్ ని పట్టించుకోవద్దని కోరాయి. శశికళ పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని, ఎవరైనా ఎంపికయ్యే వరకే ఆమె ఆ పదవిలో కొనసాగుతారని నిర్ణయించాయి. 
పట్టుకోసం కలైనార్
          తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత ముత్తువేళ్ కరుణానిధి. ఐదుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత. 94 ఏళ్ల వయసులోను పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుండటం ఆశ్చర్యమే. కొడుకు స్టాలిన్ ను సి.ఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు ఎదురు చూస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన కరుణానిధి 60 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతుండటం గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతే కాదు..ఆయన పెట్టిన పార్టీ పత్రిక ‘మురసోలి’ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో డీఎంకే పెద్ద ఎత్తున ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలను చెన్నైలో ఘనంగా నిర్వహించింది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌, ప్రభుతో పాటు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి వేడుకలు జరిపింది. అనారోగ్య కారణాల వల్ల ఈ వేడుకల్లో కరుణానిధి రాకపోయినా డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ అంతా తానై ముందుకు నడిపాడు. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మరోవైపు కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు ప్రధాన ఎన్నికల సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ ను ఆపార్టీ నియమించుకుంది. ఇటు ఏపీలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆయన ఎన్నికల సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 
రజనీకాంత్ రాజకీయం…
       తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉండగా…ఏఐడిఎంకే- 134, డిఎంకే-89, కాంగ్రెస్-08, ఐయుఎంఎల్ మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు మెజార్టీ సీట్లు సాధించేందుకు డిఎంకే ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. మరోవైపు బీజేపీ ఏఐడిఎంకేలోని రెండు వర్గాలను ఏకం చేయడం తో పాటు..సూపర్ స్టార్ రజనీకాంత్ ను మంతనాలు జరుపుతోంది. ఉమ్మడి కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలోకి రావడమే కమలం వ్యూహం. మరోవైపు రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం కోసం కసరత్తులు చేస్తుండటం ఉత్కంఠను పెంచుతోంది. ఇంకోవైపు కమల్ హాసన్ పార్టీ పెట్టే యోచన లేదని తేల్చి చెప్పడం, పిఎంకే ప్రభావం లేకపోవడం, కెప్టెన్ విజయకాంత్ ఆశించిన మేర విజయం సాధించలేకపోవడం లోటే అని చెప్పాలి. రానున్న కాలంలో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయో వేచి చూడాలి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*