న్యూ జెర్సీ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలుWant create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ మూడవ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని అమెరికా లోని ఈశాన్య రాష్ట్రాల తెలంగాణ ఎన్ఆర్ఐలు జూన్ 4 నాడు న్యూ జెర్సీ ఎడిసన్ లోని రాయల్ ఆల్బెర్ట్ పాలస్ లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సుమారు 1000 మంది తెలంగాణ ముద్దు బిడ్డలు, తెలంగాణ శ్రేయోభిలాషులు ఈ ఉత్సవానికి విచ్చేసి తెలంగాణ మట్టి మీద తమ ప్రేమను, తెలంగాణ పట్ల తమ ఆపేక్షను, ప్రజాస్వామిక స్వభావాన్ని చాటుకున్నారు. ఉత్తర అమెరికా ఈశాన్య రాష్ట్రాల నుండి తెలంగాణ వాసులు ఉరకలు వేసే ఉత్సాహంతో జూన్ 4 ఆదివారం ఉదయాన్నే సంబరాల వేదిక దగ్గరకు చేరుకున్నారు. వేదిక మీద ‘తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ సంబరాలు’ అన్న పెద్ద బేనర్ అందరినీ ఆకర్షించింది. తెలంగాణ జాతిపిత ప్రొ.జయశంకర్ చిత్రపటం ఒక వైపు అమరులకు జోహార్లర్పించే స్తూపం మరో వైపు, రంగురంగుల బతుకమ్మలు, బోనాలు వేదికను అలంకరించాయి. అమెరికాలో ఉన్న తెలంగాణా సీనియర్ సిటిజెన్ లతో జ్యోతి ప్రజ్వలనం జరిగినంక అమరులకు జోహార్లర్పిస్తూ సభ రెండు నిమిషాల మౌనం తర్వాత, అమరులు కలలు కన్న బంగారు తెలంగాణ నిర్మించాలన్న ఆకాంక్ష నినాదాలుగా ఎగసి పడింది. అమరుల కోసం సభకు విచ్చేసిన తెలంగాణ గాయకుడు జనార్ధన్ పన్నెల పాడిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి. కూచిపూడి శాస్త్రీయ నృత్యాలతో పాటు, తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే అనేక జానపద నృత్యాలు ప్రదర్శించి తెలంగాణ పాటలతో తెలంగాణ చిన్నారులు సభను అలరించారు. అనేక మంది తెలంగాణ చిన్నారులు, వారి గురువులు ఎంతో శ్రమకోడ్చి నేర్పిన నృత్యాలను అంకిత భావం తో ప్రదర్శించడం సభికులందరినీ అలరించింది. తెలంగాణ గాయకులు జనార్ధన్ పన్నెల, దీప్తి నాగ్, రామ్ ఆరెళ్ళ తమ పాటలతో సభను అలరించారు. డెలావేర్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా, మసాచూట్స్ నుండి వచ్చిన తెలంగాణ సాంస్కృతిక బృందాలు తమ జానపద పాటలతో డప్పులతో సభను తెలంగాణ సాంస్కృతిక సంరంభంగా మార్చివేశారు. తెలంగాణ మహిళలు, పురుషులు చేనేతకు మద్దతుగా పూర్తిగా రంగు రంగుల చేనేత వస్త్రాలు ధరించి సభా స్థలంలో సింగిడీలు పూయించారు. ముందు కళాకారులు డప్పు వాయిస్తుండగా తెలంగాణ మహిళలు బతుకమ్మలను బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా సాగినారు. ఆరు బయట బతుకమ్మలు పేర్చి మహిళలు బతుకమ్మ ఆడినారు. మహిళలు పురుషులూ అత్యంత ఉత్సాహంతో డప్పు వాయిద్యాలకు నృత్యం చేశారు. రాయల్ ఆల్బర్ట్ పాలస్ లోపల బయటా తెలంగాణ సాంస్కృతిక పరిమళాలు గుబాళించినాయి. తీరొక్క పూలు పూసి అంతటా ఒక అద్భుత తెలంగాణ  ఉద్యావనంమై  విరబూసింది. అందరి కండ్లలో బంగారు తెలంగాణ కోసం తపన ఆకాంక్ష ఆపేక్ష తొణికిసలాడింది.
                            ఉత్తర అమెరికా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అన్ని తెలంగాణ సంస్థలు తమ తమ సంస్థల అభిప్రాయాలకు, భావాజాలాలకు అతీతంగా ఒక్క తాటి మీదకు వచ్చి కలసి కట్టుగా జరుపుకున్న రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు తెలంగాణ ఎన్ఆర్ఐ ల మనోభావాలకు అద్దం పట్టినాయి. జెండా ఏదైనా మనందరం తెలంగాణ ముద్దుబిడ్డలమ్ అన్న భావన అందరి మనసులోనూ పొంగిపొర్లింది. తెలంగాణ సంస్థలూ, తెలంగాణ ను సమర్థించే సంస్థలూ, అందులో తెలంగాణ సంస్థలు టీడీయేఫ్, టాటా, తెనా, పీ టి‌ యే, వీ టి యే, డాటా, ఎన్ జే టీ యే, ఆటా మరియు తెలుగు సంస్థలు ఆటా, నాటా, కళాభారతి, టీఫాస్ తదితర సంస్థలన్నీ ఒక్క తాటి మీదకు వచ్చి శక్తి వంచన లేకుండా కృషి చేసి, శ్రమనూ, సమయాన్నీ, డబ్బులను ఉదాత్తంగా ధారపోసి తెలంగాణ సంబరాలను జరుపుకోవడం ఒక విశేషం. ఈ సంబరాలకు అనేక వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు తమ వంతు విరాళాలిచ్చి విజయవంతం చేయడానికి ఎంతో తోడ్పడ్డారు. సభలో అన్నీ సంస్థల వాళ్ళూ, విరాళాలిచ్చిన దాతలూ అందరూ వేదిక మీదికి వచ్చి తమ ఐక్యతను చాటారు. తెలంగాణ ఆవిర్భావాన్ని కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మనం తెలంగాణ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించే ఒక అతి నూతన బంగారు తెలంగాణాను నిర్మించుకోవాలన్న ధృడ చిత్తంతో ఇట్లాంటి సంబరాలు ఇంకా అనేకం ముందు ముందు కలసి కట్టుగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో అత్యంత ఆనందోత్సాహల మధ్య సభ ముగిసింది. తెలంగాణ యాస, భాషతో సభికులు అంత అలయ్ బలయ్ (ఆలింగనాలూ) చేసుకోవడం, తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్ని గుర్తు చేసుకుంటూ, తెలంగాణ కళలను, తెలంగాణ మీద వ్యాస రచన పోటీలు నిర్వయించి విజేతలకు బహుమతులు ఇచ్చారు, వీటితో పాటు తెలంగాణ వంటకాలను ఆరగించారు. తెలంగాణ ఆవిర్భావ సంబరాల సభను మొదటి నుండీ చివరదాక, శ్రమకోడ్చి అద్భుతంగా ప్రసారం చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింటు మీడియాకు, ఉదారంగా విరాళాలిచ్చిన దాతలందరికీ, విచ్చేసి విజయవంతం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డలకూ శ్రేయోభిలాషులకూ సభ నిర్వాహకుల తరఫున తెలంగాణ ఎన్ఆర్ఐలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*