సోష‌ల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా న‌వ‌నిర్మాణ్ దీక్ష‌



Want create site? Find Free WordPress Themes and plugins.
రాష్ట్ర విభజన తర్వాత 16 వేలకోట్ల రూపాయల లోటుబడ్జెట్‌తో పాటు రాజధాని లేకుండా రోడ్డున పడింది ఆంధ్రప్రదేశ్‌. హేతుబద్దంగా జరగని ఈ విభజన ఆంధ్రులను కుంగదీసింది. విభజన సమయంలో కాంగ్రెస్‌పార్టీ చేసిన గాయాలను ఏడాదికి ఒకసారి గుర్తుచేస్తూ, గతాన్ని తలచుకుని, భవిష్యత్‌పై కసిపెంచుకుని, అభివృద్ధి దిశగా ముందుకు సాగడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం విడిపోయిన జూన్ 2వ తేదీన నవనిర్మాణ దీక్ష చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఈ ఏడాది చేపట్టిన నవనిర్మాణ దీక్ష చర్చనీయాంశంగా మారింది. బెజవాడ బెంజిసర్కిల్ వేదికగా గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసిపడింది. బెజవాడ బందరురోడ్డులో ఉన్న నాటి మంత్రి పార్ధసారథి గృహాన్ని ఉద్యోగ జేఏసీ నేత విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు ముట్టడించారు. అనంతరం వారు బెజవాడ బెంజిసర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, ట్రాఫిక్‌ని దిగ్బంధం చేశారు. బెంజిసర్కిల్‌లో బయలుదేరిన ఈ ఉద్యమం తర్వాత కాలంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించింది. ఉధృతరూపం దాల్చింది. అది మొదలు బెంజిసర్కిల్ వేదికగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. 
                                  విభజన జరిగి మూడేళ్లు అవుతున్న సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన వేదికపైనే నవనిర్మాణ దీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే బెజవాడ బెంజిసర్కిల్ మూడు జాతీయ రహదారులను కలిపే కూడలి. చెన్నై, కోల్‌కత్తా జాతీయ రహదారితో పాటు విజయవాడ- హైదరాబాద్, విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారులు ఈ సర్కిల్ నుంచే వెళ్ళాలి. బైపాస్‌రోడ్డు కూడా లేకపోవడంతో జాతీయ రహదారిపై ప్రయాణించే భారీ వాహనాలన్నీ ఈ సర్కిల్‌ను క్రాస్ చేయాల్సి ఉంటుంది. రద్దీగా ఉండే బెంజిసర్కిల్ వద్ద నవనిర్మాణ దీక్ష కోసం ట్రాఫిక్ నిలిపివేయటం అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. కేవలం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరిగే దీక్షకోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి హైవేపై ట్రాఫిక్ నిలిపివేయటం, ట్రాఫిక్ మళ్ళింపు వంటివి ఇబ్బందికరంగా మారాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. మండుటెండలో బడిపిల్లలను, ప్రజలను ఇబ్బందిపెట్టకుండా బెంజిసర్కిల్ వద్ద దీక్ష తీసుకుని బహిరంగసభను స్వరాజ్యమైదాన్ లేదా ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేసుకోవచ్చు కదా అని పలువురు కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఆ రోజున ఉదయం 9.30 గంటలకు బెజవాడ బందర్‌రోడ్డులో డి.వి.మానర్ హోటల్ దగ్గరనుంచి చంద్రబాబు ర్యాలీగా బెంజిసర్కిల్ వరకు వచ్చారు. అనంతరం ప్రతిజ్ఞచేయించి, గంటసేపు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే… బాబు చేపట్టిన దీక్షపై పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా కార్యక్రమం చేపట్టడంపైనే ఎక్కువమందిలో అసహనం వ్యక్తమైంది. ఇలా బెజవాడ బెంజిసర్కిల్‌లో చేపట్టిన నవనిర్మాణ దీక్షపై అటు నెటిజన్లు, ఇటు ప్రభుత్వం మధ్య చర్చ మొదలైంది… కొనసాగుతోంది కూడా! 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*