టీటీడీ ఛైర్మన్ కు భలే గిరాకీWant create site? Find Free WordPress Themes and plugins.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గిరిని అందుకునేందుకు రసవత్తర పోటీ సాగుతోంది. మొదట్లో ముందు వరుసలో ఉన్నారు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోను ఆయన పేరు బాగానే వినిపించింది. ఏం జరిగిందో తెలియదు. ఆయన స్థానంలో కనుమూరి బాపిరాజును నియమించారు సోనియమ్మ. ఆ తర్వాత మరోసారి రాయపాటి పావులు కదిపినా కొన్ని వివాదాలు ఆయనకు పదవి రాకుండా అడ్డు పడ్డాయి. రాయపాటి సతీమణి చనిపోయి ఏడాది కూడ ముగియక పోవడంతో సి.ఎం చంద్రబాబునాయుడు ఆయన వైపు మొగ్గు చూపుతారా లేదా అనే సందేహం నెలకొంది. టీటీడీలో కొన్ని కార్యక్రమాలు, పూజలు ఛైర్మన్ దంపతులు దగ్గరుంచి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సతీమణి లేకపోయినా సమస్య లేదంటున్నాయి పురాణాలు. తనకు ఛైర్మన్ గిరి ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటున్నారు రాయపాటి. 
      రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ఎప్పటి నుంచో టీటీడీ ఛైర్మన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు ముందు ఈ ప్రతిపాదన చేశారు. రాయపాటికి ఇవ్వకుండా మురళీమోహన్ కు ఇస్తే పార్టీలో ఇబ్బందనే ఆలోచనలతో వారిని పక్కన పెట్టవచ్చనే వాదన సాగుతోంది. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌ అధికారి అనిల్ సింఘాల్ ను నియమించి విమర్శలు ఎదుర్కొంటోంది ప్రభుత్వం. ఇలాంటిసమయంలో చైర్మన్‌ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 
   చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఛైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టడం ద్వారా మంత్రి పదవి లేదనే అసంతృప్తి ఉండదని భావిస్తున్నారు. అందుకే ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారాంటున్నారు. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్న బొజ్జలను శాంతపరిచేందుకు ఇంత కంటే మంచి అవకాశం రాదంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే ఆయన వైపు మొగ్గు చూపుతారంటున్నారు. 
     బొజ్జలనే కాదు.. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు టీటీడీ ఛైర్మన్ రేసులో ఉన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా మీద పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. అదే సమయంలో మంత్రి రేసులో ఆయన ఉన్నారనే ప్రచారం జరిగింది. సామాజిక వర్గ సమీకరణలో భాగంగా గాలికి మొండి చేయి ఎదురైందంటున్నారు. ఇప్పుడు ముద్దుకృష్ణమనాయుడుకి ఛైర్మన్ గిరి అప్పగిస్తే అన్ని రకాలుగా బాగుటుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఆయనకు పదవి అప్పగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్లతో మాట్లాడారనే చర్చ సాగుతోంది.    
     కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు  పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని చివరిదాకా ఆశలు పెట్టుకున్నారు కాగిత వెంకట్రావు. బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందనుకున్నా వరించలేదు. దీంతో ఇప్పుడాయన చూపు తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవిపై పడింది. చంద్రబాబును కలిసి తన మనసులో మాట చెప్పారంటున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో మిగతా నేతల మాదిరిగానే వెంకట్రావు అలక బూని కొన్ని రోజులపాటు అధినేత చంద్రబాబును కలవలేదు. ఇప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు.  
     విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన చూపు ఇప్పుడు ఛైర్మన్ పదవిపై పడింది. గంతలో చంద్రబాబును కలిసిన లక్ష్మీనారాయణ తనకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాను చదలవాడకు హామీ ఇచ్చానని, ఆయన పదవీకాలం పూర్తయ్యాక పేరును పరిశీలిస్తానని అప్పట్లో చంద్రబాబు లక్ష్మీనారాయణకు అప్పట్లో చెప్పారట. చదలవాడ పదవీ కాలం పూర్తవడంతో లక్ష్మీనారాయణ చంద్రబాబును కలిసి తమ పేరును పరిశీలించాలని కోరారట. అమెరికా పర్యటన నుంచి వచ్చాక తాను ఈ పదవికి సంబంధించిన కసరత్తును ప్రారంభిస్తానని అప్పటిదాకా వేచి ఉండాలని సూచించినట్లు సమాచారం. 
    అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం టీటీడీ ఛైర్మన్ పదవి కావాలంటున్నారు. తానేం తక్కువ తిన్నానా.. పార్టీని అనంతపురంలో కాపాడాను. టీడీపీ మీద ఈగ వాలకుండా చూస్తున్నానని చెబుతున్నారాయన. కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన జేసీకి చంద్రబాబు ఆ పదవి ఇస్తారా అనేది అనుమానమే. 
     జేసీనే కాదు… నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వైకాపా నుంచి తెదేపాలో చేరిన తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, భాజపా నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు కూడా తితిదే చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారి జాబితాలో చేరారు. వైకాపా నేత జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరిగింది. కారణం ఏంటో తెలియదు. ఆయన్ను కాదని మిగతా నలుగురుకి పట్టం కట్టారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన పేరును టీటీడీ ఛైర్మన్ పదవికి పరిశీలించాలని కోరుతున్నారు అనుచరులు. చదలవాడ రాయలసీమకు చెందిన వ్యక్తి కాబట్టి ఈ సారి కోస్తాంధ్రకు చెందినవారికి ఛైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో మరి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*