రాజకీయ నేతలను పొట్టన పెట్టుకుంటున్న ప్రమాదాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రమాదాలు నేతలను పొట్టన పెట్టుకుంటున్నాయి. అది హెలికాప్టర్ కావొచ్చు, లేక రైలు ప్రమాదం కావచ్చు. రోడ్డు ప్రమాదం కావొచ్చు. కానీ ప్రాణాలు పోతుంది మాత్రం రాజకీయ నేతలవే. వారే కాదు.. వారి పిల్లలు ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారు. లోక్ సభ మాజీ స్పీకర్ జివిఎంసి బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఉత్తరాంధ్రకు చెందిన ఎర్రంనాయుడును రోడ్డు ప్రమాదం మృత్యువులా వచ్చి తీసుకెళ్లింది. దివంగత సి.ఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ కూలిన ఘటనలో నల్లమలలోని పావురాళ్ల గుట్టలో చనిపోయారు. వైసీపీ నేత శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. కారు బోల్తాపడటంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ( ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తండ్రి) ఇలానే రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. టీడీపీ నేత దేవినేని వెంకటరమణ ఇలానే గోదావరి ఎక్స్ ప్రెస్ లో వెళుతూ జూన్ 4, 1999లో ప్రమాదం జరిగి గుండె పోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. మాజీ హోం మంత్రి పి. ఇంద్రారెడ్డి ఏప్రిల్4, 2000లో రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్నకారు లారీకి ఢీకొనడంతో ఇంద్రారెడ్డి కన్నుమూశారు.
        హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆప్కాబ్ చైర్మన్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సత్యవాణి, కారు డ్రైవర్ దాసు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్ పహాడీ షరీఫ్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టీడీపీ నేత లాల్ జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆగస్టు15, 2013లో లాల్ బాషా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతుండగా ఈప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతుండగా, నల్గొండ జిల్లా, నార్కెట్‌పల్లి సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇది.  కారు కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో టీడీపీ నేత అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. 
         వైసీఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అవుటర్ రింగ్ పై తిరగబడింది. రోడ్డు పై నుంచి కిందకు వాహనం పడిన స్వల్పగాయాలతో విజయసాయిరెడ్డి బయట పడ్డారు. ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. ప్రముఖులు కోటా శ్రీనివాసరావు కుమారుడు కోటా వెంకట ప్రసాద్‌, ఎమ్మెల్యే, నటుడు బాబుమోహన్ కుమారుడు పి.పవన్‌ కుమార్‌, అజహరుద్దీన్ కొడుకు మహ్మద్‌ అయాజుద్దీన్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్‌ రెడ్డి, నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్‌.. ఇలానే ప్రాణాలు కోల్పోయారు. జూనియర్ ఎన్టీఆర్, తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు.. చాలా మంది ఎమ్మెల్యేలు రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయట పడిన సంగతి తెలిసిందే. 
          తాజాగా ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీష్ (23) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడి స్నేహితుడు రాజా రవి వర్మతో కలిసి బెంజ్ కారులో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డ్ నెంబర్ 36లో అతివేగంగా వెళుతున్న కారు మెట్రో పిల్లర్ ను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వీరిద్దరు సీటు బెల్ట్ పెట్టుకోలేదంటున్నారు. కారు వేగంగా వెళుతున్న సమయంలో మెట్రో పిల్లర్ ను ఢీకొనడంతో కారు ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంది. అయినా అంత కంటే వేగంగా కారు వెళడంతోనే ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. జిహెచ్ ఎంసీ సిబ్బంది వారిని వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఇవాళ తెల్లవారు జామున 3 గంటలకు సంఘటన జరిగింది. మృతి చెందింది మంత్రి కుమారుడనే విషయాన్ని పోలీసులు వచ్చే వరకు ఎవరికీ తెలియలేదు.
             త్వరగా వెళ్లాలనే ఆరాటం… ఆ ఆత్రుతే ప్రాణాల మీదకు తెస్తోంది… ఆ తొందర్లోనే చిన్న చిన్న జాగ్రత్తలను గాలికి ఒదిలేయడం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎందరో ప్రముఖులు, మరెంతో మంది భవిష్యతారలు ఇలాగే మృత్యువాతపడ్డారు. అతి వేగం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంటుంది. కాని భయపడేవారేవరూ. కేర్‌లెస్‌గా ఉండటమే తమకు ఇష్టమని ఆధునిక యూత్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌తో మరీ చెప్తోంది. వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటే… ఎవరికి నష్టం. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీర్చుతారు?.. చిన్న అజాగ్రత్తలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏంటని ఆరా తీస్తే… అతివేగం ఒకరిదైతే.. నిర్లక్ష్యం ఇంకొకరిది. ప్రొఫెషనల్‌ డ్రైవర్లు కాకపోవటం…. డ్రైవర్లను పెట్టుకోకపోవటం… మద్యం సేవించడం వంటివి ఎన్నో ప్రమాదానికి కారణాలవుతున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*