ఎనిమిది నెలల ముందే ఎన్నికలు..!



Want create site? Find Free WordPress Themes and plugins.
రెండు తెలుగురాష్ట్రాల్లో ఎనిమిది నెలల ముందే ఎన్నికలు రానున్నాయా.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జరగబోతున్నట్లు తెలుస్తోంది.. ఏదో ఒక రాష్ట్రానికైతే పర్వాలేదు.. ఆయా ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే చాలు కాని ఇద్దరు చంద్రులు ఒకేసారి ఎలా ఒప్పుకుంటారబ్బా అనుకుంటున్నారా.. ఈ ప్రపోజల్‌ చంద్రులది కాదు.. నరేంద్రుడిది.. అదేనండి ప్రధాని మోదీ కొత్త ప్రణాళికట.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని జమిలి విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దాని కోసం అటు కేంద్రం లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముందుకురానున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరులో దేశవ్యాప్తంగా ఇటు లోక్‌సభకు అటు అసెంబ్లీలకు ఎలక్షన్లు జరపడమే ఈ జమిలి విధానం.. గత కొంత కాలంగా ఈ అంశంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల సమయం, ధనం మిగలడం మొదటి ప్రయోజనం. అలాగే అధికార యంత్రాంగానికి సమయం కూడా ఆదా అవుతుంది. దేశంలో ఎప్పుడూ ఏవో ఒక ఎన్నికలు ఉండటం వల్ల కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వం వాటి దృష్టితో వ్యవహరించడం తప్ప ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఒకసారి ఎన్నికల క్రతువు పూర్తయితే ప్రభుత్వాలు పాలన కోణంలో పని చేయడం మొదలుపెడతాయని, దాని వల్ల దేశానికి మేలు కలుగుతుందన్నది కొందరి వాదన. కాని…
ఒకేసారి ఎన్నికల నిర్వహణకు కొన్ని పెద్ద ప్రతిబంధకాలు ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు వేర్వేరు సమయాల్లో ఎన్నిక కావడం… వాటి కాల పరిమితి వేర్వేరు సమయాల్లో పూర్తి అవుతుండటం అన్నింటికన్నా ప్రధాన ప్రతిబంధకం. వీటన్నింటినీ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపాలంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆలస్యంగా ఎన్నికలు జరపాల్సి వస్తుంది. కొన్నింటికి ముందే జరపాల్సి వస్తుంది. దీనికి ఆయా ప్రభుత్వాల అనుమతి  కావాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి కేంద్రం కొన్ని ప్రత్యమ్నాయాలు సిద్ధం చేసినట్లు సమాచారం. దీని ప్రకారం తాము ఎన్నికలు జరపాలని అనుకొన్న సమయానికి ఆరు నెలలు ముందో వెనకో ఉన్న రాష్ట్రాలను ఈ ఎన్నికలతో కలిపేస్తారు. ఆ సమయానికి ఇంకా ముందే సమయం పూర్తయిన వాటికి కొంత సమయం పొడిగించి ఈ ఎన్నికలతో కలిసేలా చూస్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రెండేళ్ళు లేదా మూడేళ్ళ పదవీ కాలం ఉంది. వాటి పదవీకాలం కుదించి ఈ ఎన్నికలతో కలిసేలా చూస్తారు. అవి ఒప్పుకోకపోతే మరో ప్రత్యమ్నాయం ఆలోచిస్తున్నారు. అవి మామూలుగా తమ ఐదేళ్ళ పదవీకాలం పూర్తి చేసుకొంటాయి. ఆ తర్వాత ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించి 2023లో మళ్ళీ జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. 
ఇటీవలే ఎన్నికలు జరిగిన ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాలకు మరో ఫార్ములా రూపొందిస్తున్నారు. దీని ప్రకారం ఇవి ఐదేళ్ళపాటు కొనసాగుతాయి. ఆ తర్వాత మరో ఏడాది కాలం పాటు వాటి పదవీ కాలం పొడిగించి 2023 లోక్‌సభ ఎన్నికలతో కలిసేలా చూస్తారు. దీనివల్ల ఈసారి అత్యధిక రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరుగుతాయని, 2023 నాటికి పూర్తి స్ధాయిలో దేశం అంతా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దానికి పార్లమెంటులో ఆమోదంతోపాటు ఏభై శాతం అసెంబ్లీల్లో కూడా ఆమోదం లభించాలి. ఇప్పటికే కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీనే అధికారం ఉండటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీల అధినేతలు మోదీ ఏదంటే అది అన్నట్లు ఉంటున్నారు కాబట్టి మన రాష్ట్రాలు సైతం దానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మోడీ అనుకున్న ప్లాన్‌ అమలు చేయడమే తరువాయి మరి…
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*