గురు : సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.

చిత్రం : గురు
రేటింగ్‌ : 3.25/5
నటీనటులు : వెంకటేష్‌, రితికాసింగ్‌, ముంతాజ్‌, నాజర్‌, తనికెళ్ల భరణి, తదితరులు
ఛాయాగ్రహణం : శక్తివేల్‌
మాటలు : హర్షవర్ధన్‌
సంగీతం : సంతోష్‌ నారాయణన్‌
నిర్మాత : ఎస్‌.శశికాంత్‌
రచన, దర్శకత్వం : సుధ కొంగర
ఫ్యామిలీ ఆడియన్సే లక్ష్యంగా సినిమాలు తీసే వెంకటేష్‌ అప్పుడప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో వస్తుంటాడు.. ఆ కోవలోనే స్పోర్ట్స్‌ బ్యాగ్రౌండ్‌ కథతో ‘గురు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. హిందీలో సాలా ఖడూస్‌ పేరుతో, తమిళంలో ఇరుది సుత్రు పేరుతో మాధవన్‌ హీరోగా విజయవంతమైన కథనే రీమేక్‌ చేశారు.. హిందీలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సహజత్వానికి దగ్గరగా ఉండే కథని ఎప్పటిలాగే తమిళంలో బ్రహ్మరథం పట్టారు.. మరి ఆ సినిమాని తెలుగులోకి తీసే సాహసం చేసిన వెంకీ విజయం సాధించారా..? కోచ్‌ పాత్రకి అద్భుతంగా సరిపోయాడు అని పేరు తెచ్చుకోగలిగిన మాధవన్‌కన్నా మెప్పించాడా అనేది సమీక్షిద్దాం..
కథేంటి…
ఆటల నేపథ్యంలో వచ్చే ఏ సినిమా అయినా సాధారణంగా ఒకే ఫార్ములాలో ఉంటాయి.. అప్పట్లో అద్భుతమైన క్రీడాకారుడు కోచ్‌గా మారతాడు.. ఆ ఆటలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే ఒక ఆటగాడు లేదా క్రీడాకారిణిని తయారు చేయాలనుకుంటాడు.. మొదట్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి.. దానితోపాటు వారిని అడ్డుకోవడానికి ఆ క్రీడలోనే ఉన్నత స్థానంలో ఉన్నవారు అడ్డుపడుతూ ఉంటారు.. అవన్నీ దాటుకుని ప్రపంచ స్థాయిలో జరిగే పోటీల్లో సత్తా చాటి ఇటు దేశ గౌరవంతోపాటు.. అటు కష్టపడిన కోచ్‌ పేరు నిలబెడతారు.. కాకపోతే పతాక సన్నివేశాల సమయంలో కాస్త ఉత్కంఠ.. మొదట్లో వెనకకు పడిన చివరి క్షణాల్లో ఒక్కసారిగా గెలుపు అందుకునే సీన్‌ ఉంటుంది.. తెలుగులో పరుగుల రాణి అశ్విని సినిమా మొదలు మొన్నటి వరకు వచ్చిన చిత్రాలన్నీ ఇదే ఫార్ములా పాటించినవే.. అదే తరహాలో కొంచం కుడి ఎడంగా గురు కథ కూడా సాగుతుంది.. క్రీడల్లో రాజకీయాల కారణంగా ప్రపంచ బాక్సింగ్‌ పోటీలకు వెళ్లలేకపోయినా క్రీడాకారుడు (వెంకీ) ఆ తరవాత కోచ్‌గా మారతాడు.. కాకపోతే నోటి దురుసు బాగా ఎక్కువ.. అలాంటి కోచ్‌కి మట్టిలో మాణిక్యంలా కూలి చేసే ఒక అమ్మాయిలో మంచి బాక్సర్‌ కనిపించి.. తనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపే వరకు కథ సాగుతుంది..
విశ్లేషణ..
ఎంత ఫార్ములా కథ ఎన్నుకున్నా కథనంలో బిగువు.. తరవాతి సన్నివేశంపై ఆసక్తి కలిగిస్తూ.. సన్నివేశాలను సహజంగా తెరకెక్కిస్తే చాలా విజయం సొంతమైనట్లే.. మాతృకకు మక్కీమక్కీగా తీసినా.. సహజత్వం మాత్రం ఎక్కడ మిస్‌ కాలేదు.. సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్‌ కన్నా మన కాలనీలో జరిగే కథలా అనిపిస్తుంది. ఎక్కడా అతి హీరోయిజం.. కథకు సరిపోని సన్నివేశాలు లేకపోవడం సినిమాకు కలిసొస్తుంది. బాక్సింగ్‌పై ఆసక్తి లేని యువతి ఎలా ప్రవర్తిస్తుందో అలానే తెరకెక్కించారు. ఆ తరవాత కోచ్‌ నిబద్ధత చూసి చలించి బాక్సింగ్‌పై గౌరవంతో నేర్చుకోవడం.. చివరి వరకు పోరాడటం సహజంగా వచ్చాయి.. ముఖ్యంగా కోచ్‌గా దర్శమిచ్చిన వెంకటేష్‌ అద్భుత నటన.. హావభావాలు సినిమాకు పెద్ద బలమనే చెప్పాలి.. దానితోపాటు పాటలు సైతం రోటీన్‌గా కాకుండా వినేందుకు చక్కగ.. సందర్భానికి తగిన విధంగా రావడం.. దానికి తగిన లిరిక్స్‌ కుదరడం బావుంటుంది.. వెంకీ పాడిన పాట సినిమాలో బాగా వర్క్‌అవుట్‌ అయ్యింది.. మాటలు కూడా బాగానే పేలాయి.. మొదటి భాగం సరదాగా గడిచినా.. రెండో అర్ధభాగం మాత్రం కొంత భారంగా కదులుతుంది.. ఒకవైపు ఎంటర్‌టైనమెంట్‌ లేకపోవడం.. హీరోయిన్‌ ఎమోషనల్‌గా ఉండటంతో వాతావరణం మారిపోతుంది.. నాజర్‌ ఎప్పుడు పెద్దహోదాలోనో.. ఏదో ఒక బాధ్యతాయుతమైన పాత్రలోనే ఉండేవాడు.. దీనిలో మాత్రం ఆయన పాత్ర కొత్తగా ఉంటుంది.. చాలా సీన్లు భావోద్వేగం కలిగించడంలో తోడ్పడ్డాడు..
ప్లస్‌పాయింట్లు..
+ వెంకటేష్‌ నటన, హావభావాలు.. కోచ్‌ పాత్రలో ఉన్నట్లు కాకుండా కోచ్‌లా కనిపిస్తాడు
+ పాటలు, మాటలు, సహజంగా సాగే సన్నివేశాలు
+ క్రీడా రంగంలో ఉండే రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపడం
మైనస్‌ పాయింట్లు..
– పతాక సన్నివేశంలో బాక్సింగ్‌ సీన్‌ ఆశించిన స్థాయిలో పండకపోవడం
– నిదానంగా సాగే ద్వితీయార్థం, మచ్చుకుకూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం
– కోచ్‌కి, క్రీడాకారిణికి మధ్య ఉండే ఎమోషన్‌ అవసరమైన మేర లేకపోవడం
ఫలితం..
రోటీన్‌ సినిమాలతో బోర్‌ కొట్టేవారికి ఈ చిత్రం కొంత రిలీఫ్‌నిస్తుంది. రీమేక్‌ సినిమా అయినా కొత్త లుక్‌తో కనిపించడం కలిసొస్తుంది.. ఒకేరోజు రెండు మూడు సినిమాలు బరిలో నిలిచే భారం మొత్తం వెంకటేష్‌పై పడుతుంది.. సినిమా క్లాస్‌ అని.. మాస్‌ అని ప్రత్యేక ట్యాగ్‌ లైన్స్‌ ఏమీ లేకపోయినా అన్ని వర్గాలకు రీచ్‌ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వెంకీకుండే ఫ్యామిలీ ఆడియన్స్‌ తోడైతే కాసుల గలగలకు కొదవుండదు.. మొత్తానికి వెంకీ ఖాతాలో మరో విజయవంతమైన చిత్రం చేరినట్లే..
సహజంగా వచ్చింది గురూ..

శ్రీ

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*