కేంద్రం కాదంటున్నా వెంక‌య్య లాబీయింగ్‌!



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సీట్ల పెంపుపై నెల‌కొన్న ఉత్కంఠ కొత్త మ‌లుపులు తిరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ సాక్షాత్తు స‌భా వేదికగా సీట్ల పెంపు లేదంటూ క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు భ‌రోసా ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ మెదక్‌ లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లి సీట్ల సంఖ్య పెంపు కుదరదని స్ప‌ష్టంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుకోసం ఆయా ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెంపు వీలుకాదని మంత్రి స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపు ఖాయమంటూ ఈ మధ్య పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చా రు. “విభజన చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం సీట్ల సంఖ్య పెంచాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. అయితే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటే రాజ్యాంగంలోని 171వ అధికరణలోని మూడవ నిబంధనను సవరించవలసి ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీట్ల సంఖ్య పెంపు కుదరదు, జనాభా లెక్కల ప్రకారం 2026 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుంది” అని ఆయ‌న‌ తేల్చి చెప్పేశారు. కాగా, కేంద్ర మంత్రి హన్సరాజ్‌ లోక్‌సభలో చేసిన ప్రకటనపై స్పందించిన వెంకయ్య నాయుడు వెంటనే హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి సీట్ల పెంపు ప్రతి పాదనలపై ఆరా తీశాన‌ని అనంత‌రం మీడియాతో తెలిపారు. శాసనసభ సీట్ల పెంపుకు సంబం ధించి కేంద్ర మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉందని, అంతకు ముందు ఈ అంశానికి సంబంధించిన చట్టాలకు సవరణలు చేయాలని ఆయన చెప్పారు. మంత్రిమండలిలో చర్చించవలసిన అంశాలకు సంబం ధించిన ప్రతిపాదనలను హోంశాఖ సిద్ధం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తన దగ్గరున్న సమాచారాన్ని లోక్‌సభలో మంత్రి హన్సరాజ్‌ ప్రకటించి ఉంటారని వెంకయ్య నాయుడు తెలిపారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తెరాస, తెదేపాలు మాత్రం అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని వాదిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి గతంలో ప్రభుత్వాలు తీసుకువెళ్ళాయి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*